Tech Tips | స్నేహ సంతసానికి సాంకేతిక సంతకం ఫేస్బుక్. అభిరుచులు ఒక్కటిగా ఉన్న వ్యక్తులను మిత్రులుగా మారుస్తుంది. నిజాలను పంచుకునే వేదికగా, చర్చోపచర్చలకు భూమికగా.. ఇలా ఈ తరం మాత్రమే కాదు, పాత తరం కూడా పట్టుకొని వదలనంతగా దగ్గరైంది ఈ ‘ముఖ పుస్తకం’! అయితే, ఫేస్బుక్ వాడకంలో పట్టు దొరక్క స్కామర్ల చేతికి చిక్కుతున్న వాళ్లూ కోకొల్లలు . ఎఫ్బీ ఎరగా చొరవ చూపి చోరీ చేసే స్కామర్లను కట్టడి చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
ఫేస్బుక్ ఓ సామాజిక విప్లవం. ఓ అనుభవం పంచుకోవాలన్నా, సమాచారం షేర్ చేయాలన్నా.. ఎఫ్బీ తలుపులు సదా తెరిచే ఉంటాయి. భావ వ్యక్తీకరణకు ఆకాశమంత అవకాశం కల్పించింది. వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి, సెలబ్రిటీ హోదా అందుకోవడానికి వీటన్నిటికీ శక్తినిచ్చే సాధనం ఫేస్బుక్. అయితే, బాధితుల కోసం కాచుకొని ఉండే స్కామర్లు ఎఫ్‌బీని వారి అరాచకాలకు అడ్డాగా మార్చుకున్నారు. వినియోగదారుల సామాజిక మాధ్యమాల హ్యాండిల్ ద్వారా లింక్‌లు, కనెక్షన్లు కనుక్కొని రెచ్చిపోతున్నారు.
వేషం మార్చి: ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి బాధితుడి వ్యక్తిగత సమచారానికి యాక్సెస్ పొందుతారు. అంతేకాదు సోషల్ ఇంజినీరింగ్ అస్ర్తాలను సంధించి వినియోగదారుల ప్రొఫైల్, సామాజిక స్థితి, ఫ్రెండ్స్‌తో ఆ వ్యక్తికి ఉన్న సంబంధాలు అన్నిటినీ సేకరిస్తారు. ఈ సమాచారం అంతా చేతికి చిక్కాక స్కామర్ అసలు పని మొదలుపెడతాడు. ఎఫ్బీలోని ఫ్రెండ్స్‌కు డబ్బులు కావాలని మీరు అడిగినట్టుగా సందేశాలు పంపుతాడు. దగ్గరివాళ్లు ఐసీయూలో ఉన్నారని, వెంటనే దవాఖాన బిల్లు కట్టాలంటూ మొరపెట్టుకుంటారు. ఆ మాటలు నమ్మితే జేబుకు చిల్లుపడటం గ్యారెంటీ.
రొమాన్స్ స్కామ్: ఎఫ్బీ ప్రొఫైల్ ఫొటోతో మాయాజాలం చేసి నిలువునా ముంచేస్తుంటారు. అబ్బాయిలకు అమ్మాయి ప్రొఫైల్‌తో, అమ్మాయిలకు అబ్బాయిల ప్రొఫైల్‌తో మాయగాళ్లు దగ్గరవుతారు. విదేశాల్లో డాక్టర్లుగా, పైలట్లుగా, శాస్త్రవేత్తలుగా ప్రొఫైల్ చేసి పరిచయం చేసుకుంటారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన, విడాకులు తీసుకున్న వ్యక్తులే వీళ్ల ప్రధాన టార్గెట్. వయసు దాటినా పెండ్లికాని వ్యక్తులను లక్ష్యంగా ఎంచుకుంటారు. ముందుగా స్నేహ హస్తం అందిస్తారు. ఆపై చనువు పెంచుకుంటారు. అంతా ఆన్లైన్లోనే..! ఈ వింత కవ్వింతలకు ఒళ్లంత పులకరించిపోయి వారి ముగ్గులోపడిపోతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడితే మనం కలిసి ఉండొచ్చని నమ్మబలుకుతారు. ఆరోగ్యం సమస్యనూ సాకుగా చూపించి అందినకాడికి దోచుకుంటారు. మరికొందరు మరింత తెగించి అశ్లీల సంభాషణలు చేస్తారు. నగ్నంగా వీడియోకాల్ చేసేలా ప్రేరేపిస్తారు. వారి మోసాన్ని కనిపెట్టకుండా అడిగినవన్నీ చేస్తే.. ఆ వీడియోలను అడ్డుగా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారు.
చారిటీ స్కామ్: అభాగ్యుల సేవ పేరిట చందాలు వసూలు చేసేవాళ్లు బయట మాత్రమే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ కనిపిస్తారు. సేవా సంస్థలు నిర్వహిస్తున్నామంటూ, నిరుపేదలను చదివిస్తున్నామంటూ నకిలీ ఫొటోలు, వీడియోలతో బురిడీ కొట్టిస్తారు. ఫ్యాన్సీ వెబ్సైట్లు, వీడియోలతో నమ్మేలా చేస్తారు. ప్రొఫైల్ చూడగానే విరాళం ఇవ్వడానికి సిద్ధపడిపోతుంటారు. అయితే ఈ బూటకపు స్వచ్ఛంద సంస్థలు బ్యాంకు ఖాతా
వివరాలను ఇవ్వవు. యూపీఐ పేమెంట్లను ప్రోత్సహిస్తుంటాయి.
షాపింగ్ స్కామ్: సాధారణ సామాజిక స్థాయి నుంచి ఫేస్బుక్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. వివిధ బ్రాండ్ దుస్తులు, వస్తువులకు సంబంధించిన ప్రకటనలు వెల్లువెత్తుతుంటాయి. అయితే, ఈ ప్రకటనలను అడ్డుపెట్టుకొని భారీ ఆఫర్లు ఇచ్చేస్తుంటారు కొందరు. పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వీటిని తెగ ప్రమోట్ చేస్తారు. అయితే, అసమంజసమైన ధరలకు ఏదైనా వస్తువు దొరుకుతున్నదంటే.. ఎగిరి గంతేయడానికి ముందు అనుమానించాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటేనే వాటి కొనుగోలు విషయం ఆలోచించండి.
ఎఫ్బీ పేజ్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ ఎంత పకడ్బందీగా ఉంటే.. మీ అకౌంట్ అంత సేఫ్‌గా ఉంటుంది. మీ సెట్టింగ్స్‌లో ఈ మార్పులను వెంటనే చేర్చండి..
☞ కఠినమైన పాస్వర్డ్ ఎంపిక చేసుకోవాలి.
☞ ఎఫ్బీ షాపింగ్‌లో వెరిఫైడ్ బ్రాండ్స్‌నే ఎంచుకోవాలి.
☞ తెలిసిన వారి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మాత్రమే అంగీకరించాలి. తెలిసిన వారికే స్నేహ హస్తం అందించాలి.
☞ ఏవైనా లింక్‌లు వస్తే చూసీచూడగానే క్లిక్ చేయకండి. అవెంత వరకూ సురక్షితమో తెలుసుకోండి. https://www.isitphishing.org వెబ్సైట్ ద్వారా లింక్ గుట్టు రట్టు చేయొచ్చు.
☞ https://www.facebook.com/ help/193677450678703 లింక్ ద్వారా ప్రైవసీ సెట్టింగ్‌లో మార్పులు చేసుకోవచ్చు.
☞ హ్యాక్ అయినట్టయితే https://www.facebook.com/hacked లింక్ ద్వారా తెలియజేయాలి.
☞ రిపోర్ట్ చేయాలనుకుంటే https://www.facebook.com/help/355811251195044 లింక్ ఉపయోగించండి.
☞ https://www.facebook.com/help/ 196419427651178 లింక్ ద్వారా ఫేస్బుక్ పేజీ లాక్ చేయొచ్చు.
☞ ఫేస్బుక్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలి.
☞ పాస్వర్డ్ మార్చాలి.
☞ అకౌంట్ బ్లాక్ చేయాలి. (బెదిరింపులు, అసభ్యకరమైన ట్రోలింగ్ ఎదురైతే)
☞ బుల్లీయింగ్, పేమెంట్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ జాగ్రత్త చేయాలి.
☞ అయినా సమస్య పరిష్కారం కాకపోతే.. 1930 నంబర్‌కు ఫోన్ చేయండి. పోలీసులను సంప్రదించొచ్చు. https://cybercrime.gov.in/ లింక్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Tech Tips | మీ ఫోన్ పోయిందా? సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే ఈ జాగ్రత్తలు మస్ట్!
“Deep Fakes | ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న డీప్ ఫేక్స్.. ఇవి ఎందుకంత డేంజర్?”