Tech Tips | ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడుకునే సాధనం మాత్రమే! మరి ఇప్పుడు.. ప్రపంచాన్ని మన ముందుంచే ప్రియదర్శిని. మన సంగతులన్నీ తనలో ఇముడ్చుకున్న బోషాణం ఈ హస్త భూషణం. ఫోన్ ఒక గంట కనిపించకపోతేనే తెగ ఇదైపోతాం. అదే ఫోన్ దొంగల చేతికి చిక్కిందా.. పెద్ద చిక్కే! ఆ తస్కరుడు ఏ సైబర్ ముష్కరుడో అయ్యాడా.. మన పుట్టుపూర్వోత్తరాలు సహా కాజేసి కాటేయడం ఖాయం. అయితే, ఫోన్ పోయిందనే కంగారును కాసేపు అధిగమించి తెలివిగా వ్యవహరిస్తే.. మీ వస్తువు తొందరగా దొరుకుతుంది. అందులో మీ సమాచారమూ భద్రంగా ఉంటుంది.
ఫోన్ దొంగిలించిన వ్యక్తి వెంటనే దాన్ని స్విచ్చాఫ్ చేయడం రివాజు. లొకేషన్ ట్రేస్ చేస్తారని ఆ పని చేస్తాడు. పొరపాటున ఫోన్ పారేసుకుంటే అది ఏ దొంగబుద్ధిమంతుడి చేతికి దొరికినా.. అదే పని చేస్తాడు. పదేపదే మన
నంబర్‌కు ఫోన్ చేయడం, అది స్విచ్చాఫ్ వస్తుండటంతో కలత చెందడం వినియోగదారుడి పని. అయితే, నేటి సాంకేతిక ప్రపంచంలో పోయిన ఫోన్‌ను పట్టుకోవడం నల్లేరు మీద నడకే. దొంగతనానికి గురైన ఫోన్‌ను టెలికమ్యూనికేషన్ సాంకేతికతతో సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ క్షణాల్లో కనిపెట్టే అవకాశం ఉంది. ద సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సీఈఐఆర్) ఏర్పాటుచేసిన టెలి కమ్యూనికేషన్ విభాగం పోయిన ఫోన్ల రికవరీలో పోలీసులకు సహాయకారిగా ఉంటున్నది. అన్ని ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఏమ్ఈఐ) డేటా బేస్‌తో లింక్ అవుతూ.. ఈ విస్తృత నెట్‌వర్క్‌లో ఫోన్ జాడ కనుక్కోవడం చాలా తేలిక.
ఫోన్ పోగానే దగ్గర్లోని పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. https://ceir.gov.in/ వెబ్‌లింక్ ద్వారా పోలీసులు ఫోన్‌ను ట్రాక్ చేస్తారు. ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడంతోపాటు పోయిన ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. దీనివల్ల దొంగతనం చేసిన వ్యక్తి అందులో వేరే సిమ్ వేసినా ఫోన్ పనికిరాదు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఐఎమ్ఈఐ నంబర్ తెలుసుకోవడం కూడా తేలికే! ఫోన్ అందుబాటులో ఉన్నప్పుడే విధిగా 15 అంకెల ఐఎమ్ఈఐ నంబర్‌ను తెలుసుకోవడం అవసరం. ఎలాగంటే.. https://ceir.gov.in/-Device/CeirIMEIVerification.jsp లింక్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయడంతో ఐఎమ్ఈఐ నంబర్ డిస్ప్లే అవుతుంది.
ఎఫ్ఐఆర్ కాపీ గానీ, ఫోన్ పోయినట్టుగా మరేదైనా గుర్తింపు పత్రంగానీ తీసుకోవాలి. దాని సాయంతో మీ పాత నంబర్‌తో డూప్లికేట్ సిమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు https://www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect.jsp లింక్ ఓపెన్ చేయాలి. పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు కాపీ, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం (ఆధార్) వివరాలు నమోదు చేయాలి. కొత్తగా తీసుకున్న నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేయొచ్చు.
☛ సీఐఈఆర్లో మన ఫిర్యాదు స్టేటస్ https://ceir.gov.in/Request/CeirRequestStatus.jsp లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. అందులో ‘చెక్ రిక్వెస్ట్ స్టేటస్’ ఆప్షన్ క్లిక్ చేసి, రిక్వెస్ట్ ఐడీ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలిసిపోతుంది.
తీరా ఫోన్ దొరికాక అది ఎందుకూ పనికిరాకుండా ఉంటే ఏం ప్రయోజనం. అందుకే, దానిని అన్‌బ్లాక్ చేసుకోవాలి. ఇందుకోసం https://ceir.gov.in/Request/CeirUserUnblockRequestDirect.jsp లింక్ ఓపెన్ చేయాలి. ఇదివరకు బ్లాక్ చేసినప్పుడు వచ్చిన రిక్వెస్ట్ ఐడీని ఎంటర్ చేయాలి. ఎందుకు అన్‌బ్లాక్ చేస్తున్నారన్న కారణాన్ని వివరించి.. అన్‌బ్లాక్ చేయొచ్చు.
ఫోన్ పోయినప్పుడు అందులోని సమాచారం చోరుల చేతికి చిక్కకుండా వెంటనే తొలగించే అవకాశం కూడా ఉంది.
☛ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ పోయినట్లయితే.. https://support.google.com/accounts/answer/6160491?hl=en లింక్ ద్వారా ఫైండ్, లాక్, ఎరేజ్ అనే ఆప్షన్స్‌ను ఉపయోగించొచ్చు.
☛ ఐ ఫోన్ పోయినట్లయితే.. iCloud.com, https://support.apple.com/en-in/guide/icloud/mmfc0ef36f/icloud ద్వారా ఫోన్లో సమాచారాన్నంతా డిలీట్ చేయొచ్చు.
☛ https://www.google.com/ android/find లింక్‌ను ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చు.
☛ https://www.apple.com/ in/icloud/ find-my/ లింక్‌ను ఉపయోగించి ఐఫోన్ జాడ తెలుసుకోవచ్చు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
“Deep Fakes | ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న డీప్ ఫేక్స్.. ఇవి ఎందుకంత డేంజర్?”