TCS Q3 Results | దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ల అంచనాలు తప్పింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం నాలుగు శాతం వృద్ధితో రూ.10,846 కోట్లకు పెరిగిందని తెలిపింది. కానీ, మార్కెట్ వర్గాలు రూ.11,200 కోట్ల మేరకు టీసీఎస్ నికర లాభం గడిస్తుందని అంచనా వేశాయి.
కానీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ విషయంలో దలాల్ స్ట్రీట్ అంచనాలను టీసీఎస్ తారుమారు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఆదాయం 5.3 శాతం పెంచుకుని రూ.58,229 కోట్లు సముపార్జించింది. మార్కెట్ వర్గాలు కేవలం రూ.56,893 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రమే పొందుతుందని అంచనాకు వచ్చాయి. ఇక తన వాటాదారులకు టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్‌పై స్పెషల్ డివిడెండ్ రూ.67, ఇంటరిం డివిడెండ్ రూ.8 ప్రకటించింది. ఇదిలా ఉంటే, గత 12 నెలల్లో సంస్థ నుంచి ఇతర ఐటీ సంస్థలకు వలస (అట్రిక్షన్స్) వెళ్లిన సిబ్బంది 21.3 శాతం ఉంటారని టీసీఎస్ తెలిపింది.
సంప్రదాయంగా బలహీనంగా ఉండే సమయంలో క్లౌడ్ సర్వీసుల ఆధ్వర్యంలో బలమైన వృద్ధిరేటు నమోదు చేశామని టీసీఎస్ సీఈఓ కం ఎండీ రాజేశ్ గోపినాథన్ చెప్పారు. వెండర్ల కన్సాలిడేషన్‌తో మార్కెట్ షేర్ పెంపు, ఉత్తర అమెరికా, బ్రిటన్లలో యధాతథ స్థితి కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్నా, లాంగ్‌టర్మ్ గ్రోత్ ఔట్‌లుక్‌లో ధృడమైన వృద్ధి సాధిస్తామని ప్రకటించింది.
కరెన్సీ రూపంలో 13.5 శాతం రెవెన్యూ గ్రోత్ సాధించినట్లు టీసీఎస్ వెల్లడించింది. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో వివిధ సంస్థలతో 750 కోట్ల డాలర్ల విలువ గల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది రెండు త్రైమాసికాల్లోనూ 800 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలను టీసీఎస్ కుదుర్చుకున్నది.