Samsung Galaxy F56 5G | ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో ఇప్పుడు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న శాంసంగ్ కూడా వినియోగదారులను ఆకట్టుకునే ఫోన్లను రూపొందించి అందిస్తున్నాయి. శాంసంగ్‌కు చెందిన మిడ్ రేంజ్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే ఆ కంపెనీ లేటెస్ట్గా ఓ నూతన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎఫ్56 5జి పేరిట లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. కనుక డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్లో శాంసంగ్‌కు చెందిన ఎగ్జినోస్ 1480 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. వేపర్ చాంబర్ కూలింగ్ ఫీచర్ ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ అంత సులభంగా హీట్‌కు గురి కాదు. 8 జీబీ ర్యామ్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్‌ను కూడా ఇచ్చారు. ముందు వైపు 12 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత వన్ యూఐ 17 ఓఎస్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు గాను 6 జనరేషన్స్ వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్తోపాటు సెక్యూరిటీ అప్డేట్స్ను కూడా అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. కనుక ఫోన్ బిల్డ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది.
ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే సూపర్ ఫాస్ట్ చార్జ్ 2.0 టెక్నాలజీ కూడా ఈ బ్యాటరీకి ఉంది. అయితే ఫోన్‌తోపాటు బాక్సులో చార్జర్‌ను మాత్రం అందించడం లేదు. 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. యూఎస్బీ టైప్ సిని పొందవచ్చు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి అదనపు ఫీచర్లను కూడా అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్56 5జి ఫోన్ గ్రీన్, వయొలెట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌కు చెందిన 8బీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గా ఉంది. శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఇతర ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో రూ.2000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈజీ ఈఎంఐ సదుపాయాన్ని కూడా ఈ ఫోన్‌పై అందిస్తున్నారు.