Artificial Intelligence | న్యూఢిల్లీ, ఆగస్టు 2: రెస్టారెంట్‌కు వెళ్లి ఏ ఫుడ్ ఐటమ్ ఆర్డర్ ఇవ్వాలో తేల్చుకోలేక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారా? గిఫ్ట్ షాపుకెళ్లి ఏం కొనాలో తికమకపడుతున్నారా? ఈ సమస్య మీ ఒక్కకరిదే కాదు..ప్రస్తుతం దేశంలో అత్యధిక శాతం మంది అతిగా ఆలోచిస్తూ ఓ పట్టాన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ అతి ఆలోచన నుంచి బయటపడేందుకు చాలామంది టెక్నాలజీని ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయిందని ఓ తాజా సర్వేలో వెల్లడైంది.
ఏదీ తేల్చుకోలేక అయోమయంలో పడినపుడు స్పష్టత కోసం చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ(ఏఐ)ను, గూగుల్ సెర్చ్ ఇంజిన్ని అత్యధిక భారతీయులు ఉపయోగిస్తున్నట్లు సెంటర్ ఫ్రెష్, యూగవ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదిక తెలియచేసింది.
ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు నిర్ణయాల్లో సాయం కోసం టెక్నాలజీని ఆశ్రయిస్తున్నట్లు తేలింది. 2,100 మంది భారతీయులతో శాంపిల్ సైజు సర్వే నిర్వహించగా తాము రోజులో మూడు గంటలు అతిగా ఆలోచిస్తున్నామని అందులో 81 శాతం మంది ఒప్పుకున్నారు. అదో నిత్య అలవాటుగా తమకు మారినట్లు నలుగురిలో ఒకరు చెప్పారు. అతిగా ఆలోచించకుండా త్వరితంగా నిర్ణయం తీసుకునేందుకు తాము చాట్‌జీపీటీపై ఆధారపడుతున్నట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు తెలియచేసినట్లు ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్టు పేర్కొంది.
దేశవ్యాప్తంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలలో ఈ సర్వే జరిగింది. ఆహారం, జీవనశైలి అలవాట్లు, డిజిటల్ సోషల్ లైఫ్, డైటింగ్, రిలేషన్షిప్స్, కెరీర్ అంశాలపై ఈ సర్వే నిర్వహించారు. చిన్న చిన్న విషయాలపై నిర్ణయం తీసుకోవడంలో కూడా అతిగా ఆలోచించడం భారతదేశ ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయినట్లు ఈ సర్వే కనుగొంది.