Google One Cloud Storage | ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లలో 16జీబీ, 32 జీబీ.. ఇలా ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించేవారు. కానీ మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ని ఎంత కావాలంటే అంత పెంచుకునే సదుపాయం కల్పించారు. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఫోన్ స్టోరేజ్ విషయంలో పెద్దగా ఇబ్బందులు వచ్చేవి కావు. అయితే ప్రస్తుతం 128జీబీ మొదలుకొని 256 జీబీ, 512జీబీ, 1టీబీ వరకు ఫోన్లలో స్టోరేజ్ కెపాసిటీని అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫోన్ల వాడకం పెరిగింది. కెమెరాతో ఫొటోలు, వీడియోలను అధికంగా తీసుకుంటున్నారు. మరోవైపు వాట్సాప్‌తో సహా సోషల్ మీడియా యాప్స్‌ను అధికంగా వాడుతున్నారు. వీడియోలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. మ్యూజిక్ ను స్ట్రీమ్ చేస్తున్నారు. దీంతో ఫోన్లలో అందిస్తున్న స్టోరేజ్ సరిపోవడం లేదు. మరోవైపు మైక్రో ఎస్డీ కార్డు వేసుకునే సదుపాయం చాలా వరకు ఫోన్లలో లభించడం లేదు. దీంతో వినియోగదారులు స్టోరేజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే దీనికి గాను ఎయిర్టెల్, గూగుల్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఓ పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తున్నాయి. ఎయిర్టెల్ లో పోస్ట్ పెయిడ్ లేదా వైఫై వినియోగదారులు ప్రస్తుతం గూగుల్ వన్ ప్లాట్ ఫామ్‌పై 100 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా పొందవచ్చు. 6 నెలల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఈ రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి. గూగుల్‌లో క్లౌడ్ స్టోరేజ్ కోసం ఇప్పటికే గూగుల్ వన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ సేవలను పొందాలంటే వినియోగదారులు నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాలి. వార్షిక ప్లాన్లతో గూగుల్ వన్ కు సబ్ స్క్రైబ్ చేసుకుంటే కాస్త తక్కువ మొత్తంలో ఫీజు చెల్లించాలి. అదే నెలవారి ప్లాన్ అయితే 100 జీబీ కి గాను రూ.135 వరకు అవుతుంది.
అయితే ప్రస్తుతం 100 జీబీ ప్లాన్‌ను ఎయిర్ టెల్ కస్టమర్లు ఉచితంగానే పొందవచ్చు. ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ లేదా వైపై కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. వారు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్‌ను సందర్శించి తమ ఉచిత ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో 6 నెలల వరకు ఎలాంటి చార్జిలు లేకుండా 100 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా పొందవచ్చు. అయితే 6 నెలలు ముగిశాక కస్టమర్లు ఈ సేవను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా నెలకు రూ.125 ఎయిర్‌టెల్‌కు చెల్లిస్తూ ఈ ప్లాన్‌లో కొనసాగవచ్చు. దీంతో వినియోగదారులకు ఫోన్లో స్టోరేజ్ అయిపోతుందన్న దిగులు చెందాల్సిన పని ఉండదు.
కాగా గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్‌ను పొందితే కస్టమర్లు జీమెయిల్, ఫొటోలు, డ్రైవ్‌లలో కలిపి మొత్తానికి గాను 100 జీబీ పొందుతారు. ఎందులో ఫైల్స్‌ను సేవ్ చేసుకున్నా మొత్తం ఒకే ప్లాట్‌ఫామ్‌పై స్టోరేజ్ అనేది లెక్కించబడుతుంది. ఫోన్లలో స్టోరేజ్ తక్కువగా ఉందని భావించేవారు ఈ ప్లాన్‌ను తీసుకుంటే ఉపయోగం ఉంటుందని ఎయిర్ టెల్, గూగుల్ కు చెందిన ప్రతినిధులు తెలియజేశారు. ఇక గూగుల్ వన్ ప్లాట్ ఫామ్ లో లైట్ ప్లాన్‌ను తీసుకుంటే 30 జీబీ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. అదే బేసిక్ ప్లాన్‌తో 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ డేటాను పొందవచ్చు. స్టాండర్డ్ ప్లాన్‌లో 200 జీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ప్లాన్లకు నెలవారిగా అయితే వరుసగా రూ.59, రూ.130, రూ.210 చెల్లించాలి. అదే వార్షిక చందా తీసుకుంటే ఈ ప్లాన్లపై వరుసగా రూ.209, రూ.511, రూ.771 ఆదా చేయవచ్చు.