న్యూయార్క్ : సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్‌లను నడిపే కంపెనీ మెటా సంక్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటోంది. గ్రూప్ సంస్ధల్లో తాజా నియామకాలను నిలిపివేస్తున్నామని, ఉద్యోగుల బడ్జెట్లలో కోతలు విధిస్తున్నామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఉద్యోగులతో భేటీ సందర్భంగా స్పష్టం చేశారు.
కంపెనీ రాబడులు గణనీయంగా పడిపోతుండటంతో మెటా ఈ చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. 2004లో కంపెనీ ప్రస్ధానం ప్రారంభమైన అనంతరం ఈస్ధాయిలో బడ్జెట్ కోతలు, నియామకాల నిలిపివేత ఇదే తొలిసారి. మరోవైపు టీంల పునర్వ్యవస్ధీకరణపైనా మెటా ఫోకస్ పెడుతుండటంతో ఈ ప్రక్రియ లేఆఫ్స్‌కు దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
లేఆఫ్స్‌పైనా మెటా సీఈవో ఉద్యోగులను హెచ్చరించారు. కంపెనీ వేగవంతవమైన వృద్ధి శకం ముగిసిందని సిబ్బందితో సమావేశమైన సందర్భంగా జుకర్‌బర్గ్ తేల్చిచెప్పినట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. గత 18 ఏండ్లుగా మనం వేగంగా ఎదిగామని, ఇక ఇటీవల కాలంలో కంపెనీ రాబడి నిలకడగా ఉండి ఆపై తొలిసారిగా పడిపోయిందని ఉద్యోగులకు జుకర్‌బర్గ్ వివరించారు.