Tech News | న్యూఢిల్లీ, నవంబర్ 10: స్మార్ట్ఫోన్లలో టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో అది వ్యయ భారమేనని సామ్సంగ్, క్వాల్కమ్ తదితర కంపెనీలు చెప్తున్నాయి. లైవ్ టీవీ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీని స్మార్ట్ఫోన్లలో తీసుకువస్తే ఆయా ఫోన్ల ధరలు కనీసం మరో 30 డాలైర్లెనా (దాదాపు రూ.3 వేలు) పెరుగుతాయని అంటున్నాయి. మోడల్, బ్రాండ్‌నుబట్టి రేట్లు ఇంకా ఎక్కువే పెరుగవచ్చన్న అంచనాలూ వినిపిస్తుండటం గమనార్హం. ఫోన్ హార్డ్‌వేర్‌ను మార్చాల్సి వస్తుండటమే ఇందుకు కారణంగా ఆయా కంపెనీలు వివరిస్తున్నాయి. ఈ మేరకు సామ్సంగ్, క్వాల్కమ్తోపాటు ఎరిక్సన్, నోకియా సంస్థలు కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ మం త్రిత్వ శాఖకు సంయుక్తంగా గత నెల్లోనే ఓ లేఖను సైతం పంపినట్టు సమాచారం.
బ్యాటరీ ఆగదు
స్మార్ట్ఫోన్లలో టీవీ ప్రత్యక్ష ప్రసారాలకు అవకాశం కల్పిస్తే మొబైల్ బ్యాటరీ త్వరగా డౌన్ అయిపోతుందని ఆయా కంపెనీలు పేర్కొంటున్నాయి. దీనివల్ల కస్టమర్లకు లేనిపోని సమస్యలు ఎదురుకావచ్చన్న ఆందోళనను కనబరుస్తున్నాయి. అయితే దీనిపై స్పందించేందుకు అటు సామ్సంగ్, క్వాల్కమ్, ఎరిక్సన్, నోకియా సంస్థలు, ఇటు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ అంశంపై సంస్థలు, ప్రభుత్వం మధ్య నడుస్తున్న చర్చలే ఇందుకు కారణమని తెలుస్తున్నది.
ఏటీఎస్సీ 3.0తో..
సెల్యులార్ నెట్వర్క్స్తో పనిలేకుండా స్మార్ట్ఫోన్లలో లైవ్ టీవీ సిగ్నల్స్‌ను తప్పనిసరి చేస్తూ ఓ కొత్త విధానాన్ని తీసుకురావాలని మోదీ సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం ఆయా టెలికం సంస్థల ఇంటర్నెట్ ప్యాకేజీలతో యూట్యూబ్, ఇతర యాప్‌ల ద్వారానే లైవ్ టీవీ.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఉత్తర అమెరికాలో ఎంతో ప్రజాదరణ పొందిన ఏటీఎస్సీ 3.0 టెక్నాలజీ సాయంతో నేరుగా ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో టెలికం కంపెనీల అవసరం లేకుండానే టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలకు వీలు కల్పించాలని కేంద్రం చూస్తున్నది. ఏటీఎస్సీ 3.0తో టీవీ సిగ్నల్స్ ఖచ్చితమైన జియో-లొకేటింగ్కు వీలుంటుంది. దీంతో మొబైల్ యూజర్లు అత్యంత నాణ్యమైన వీడియోలను వీక్షించవచ్చు. నిజానికి అమెరికాతోపాటు దక్షిణ కొరియా వంటి కొన్ని దేశాల్లో మా త్రమే ఇప్పుడు స్మార్ట్ఫోన్లపై టీవీ ఛానళ్ల డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్ జరుగుతున్నది.
కంపెనీలకు దెబ్బ
ఏటీఎస్సీ 3.0కు అనుగుణంగా భారత్‌లో ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్ఫోన్లు, మార్కెట్లోకి కొత్తగా అమ్మకానికి వచ్చిన ఏ మోడల్స్ కూడా లేవు. దీంతో స్మార్ట్ఫోన్లలో కేంద్ర ప్రభుత్వ లైవ్ టీవీ ఆలోచన ఆచరణలోకి వస్తే ఇప్పుడున్న తయారీ వ్యవస్థలో భారీగానే మార్పులు చేయాల్సి వస్తుందని, ఇది తమకు చాలా నష్టమని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్మార్ట్ఫోన్లలో రకరకాల కంపోనెంట్స్‌ను అదనంగా పెట్టాల్సి వస్తుందని అంటున్నాయి. అంతేగాక మొబైల్స్ ధరలు పెరిగి అమ్మకాలు పడిపోవచ్చని, ఇంకోవైపు టెలివిజన్ల విక్రయాలు కూడా క్షీణించవచ్చని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు పెట్టుబడులకూ ఇబ్బందేనని హెచ్చరిస్తున్నాయి. టెలికం కంపెనీలు సైతం తమ వ్యాపారం తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) సైతం రంగంలోకి దిగి లాబీయింగ్ చేస్తున్నది. కాగా, దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సామ్‌సంగ్‌కు అత్యధికంగా 17.2 శాతం వాటా ఉన్నది. రెండో స్థానంలో షియామీ (16.6 శాతం) ఉండగా, యాపిల్‌కు 6 శాతం వాటా ఉన్నది.