తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇస్రో సైంటిస్టుల బృందం దర్శించుకున్నది. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు స్వామి వారిని దర్శించుకుని ఎల్లుండి ప్రయోగించే పీఎస్ఎల్వీ రాకెట్ విజయవంతం కావాలని మొక్కులు చెల్లించుకున్నారు. రాకెట్ నమూనాను మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు, అధికారులు ఇస్రో శాస్త్రవేత్తలకు స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందించారు.
ప్రతీ రాకెట్ ప్రయోగం చేపట్టడానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని రాకెట్ నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయడం ఆనవాయితీ. శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ నెల 14 న ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ 52 నింగిలోకి దూసుకెళ్లనున్నది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ఏడాది ఇది మొదటి రాకెట్ ప్రయోగం.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ 52(పీఎస్ఎల్వీ) వాహక నౌక ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయోగానికి ముందు చేపట్టే కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు ప్రారంభమవుతుంది. కౌంట్ డౌన్ ప్రక్రియ 25 గంటల 30 నిముషాలపాటు కొనసాగనున్నది. ఈ రాకెట్ ద్వారా ఆర్ఐశాట్-1ఏ తోపాటు ఐఎన్ఎస్-2టీడీ, ఇన్ స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.