Gaganyaan | చంద్రయాన్-3 మిషన్ విజయవంతంతో దూకుడుమీదున్న ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 మిషన్ చేపట్టనున్నది. ఈ ప్రయోగం కోసం శుక్రవారం కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నది. అదే సమయంలో మానవ సహిత అంతరిక్ష మిషన్ ‘గగన్‌యాన్’పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తమిళనాడు మహేంద్రగిలోని పరిశోధనా కేంద్రంలో క్రయోజనిక్ ఇంజిన్‌ను గురువారం విజయవంతంగా పరీక్షించింది. దాదాపు 720 సెకన్ల పాటు ఇంజిన్ మండించినట్లు ఇస్రో పేర్కొన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఈ విజయం కీలకమైన మైలురాయిగా పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఇస్రో గగన్‌యాన్‌లో మిషన్‌లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. మిషన్‌లో వ్యోమగాములు భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించి.. అంతరిక్షంలో పరిశోధనలు చేపట్టనున్నారు. ఆ తర్వాత మళ్లీ వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకువచ్చేందుకు వివిధ దశలో ఇస్రో పరిశోధనలు చేస్తున్నది. ఇంతకు ముందు మేలో హెచ్ఎస్ 200 బూస్టర్‌ను, జూన్‌లో సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (SMPS)ని విజయవంతంగా పరీక్షించింది. గగన్‌యాన్ మిషన్‌ను 2024లో నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతున్నది.