Humanoid Robots | మనల్ని ఎవరైనా పలకరిస్తే… నువ్వు మనిషివేనా… అని అడగాల్సిన పరిస్థితి త్వరలోనే రాబోతున్నది. జస్ట్, హెలో… అన్నందుకే అంత మాట అనాలా… అనుకోకూడదు. అది అవసరం. ఎందుకంటే చైనాలో ఒక ఫ్యాక్టరీ అచ్చంగా మనుషుల్ని పోలిన హ్యూమనాయిడ్ రోబోలను కుప్పలు తెప్పలుగా తయారు చేస్తున్నది. హావభావాలనూ వ్యక్తం చేయగల సామర్థ్యమున్న ఇవి రేపు మనుషుల్లో కలిసిపోతే… అసలు నువ్వు మనిషివేనా అని అడగడంలో తప్పేముంది చెప్పండి?
డ్రాగన్ దేశం చేసే చిత్రాలు అన్నీ ఇన్నీ కాదు. మనుషుల జీవితాలను ప్రభావితం చేసే ప్రయోగాలను అది చేసినంతగా మరేదేశం చేయలేదేమో. అందులో టెక్నాలజీని వినియోగించడంలోనూ అస్సలు వెనకబడదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదీ అలాంటి ఓ వింతే. ఇది డాలియన్ సిటీలోని ఎక్స్-రోబోస్ అనే హ్యూమనాయిడ్ రోబోల ఫ్యాక్టరీ. ఇంతకు ముందు మనం చూస్తున్న హ్యూమనాయిడ్ (మనుషుల్ని పోలిన) రోబోలకు అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఇక్కడ రూపొందుతున్నాయి. మనుషుల్లా కనిపించడమే కాదు, మనలాగే నవ్వు, ఆశ్చర్యంలాంటి భావోద్వేగాలను స్పష్టంగా చూపించగలవు. ఇప్పటికే మెడికల్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో వినియోగంలో ఉన్న మానవరూప రోబోలలో ఈ రకానివి విప్లవాత్మక మార్పులకు తెరలేపబోతున్నాయి.
ఈ ఫ్యాక్టరీలోకి వెళితే అచ్చం మనుషుల చర్మాన్ని పోలి సిలికాన్‌తో చేసిన చేతులు, కాళ్లు, ముఖాలు పదుల సంఖ్యలో కనిపిస్తాయి. అక్కడే సగం రూపుదిద్దుకున్న, పూర్తిగా రూపుదిద్దుకున్న రోబోలు, వాటి విడి భాగాలూ కనిపిస్తాయి. ఆడామగా రూపాల్లో విభిన్న వయసుల్లో కనిపించే మరయంత్రాలుంటాయి ఇక్కడ. అన్ని హంగులూ పూర్తయిన ఓ రోబోతో ట్రయల్ రన్ చేస్తుంటారు. అక్కడ ఉద్యోగి నవ్వగానే అవతలి రోబో చక్కగా నవ్వుతుంది. అతను నాలుక కరచుకుంటే, అదీ అలాగే చేస్తుంది. కేవలం అనుకరించడమే కాదు, అవతలి వ్యక్తి ఏ సందర్భంలో అలా అంటున్నాడో అర్థం చేసుకుని మరీ ప్రతిస్పందించేందుకు కృత్రిమ మేధను వినియోగిస్తున్నారు. నవ్వడం, బాధ పడటం, ఆశ్చర్యం వ్యక్తం చేయడంలాంటి హావభావాలను ప్రదర్శించేందుకు ప్రత్యేక పోగ్రామింగ్తో పనిచేసే అనేక చిన్న మోటార్లను వీటి ముఖంలో అమరుస్తున్నారు. మనుషుల్ని పోలినవీ ఇందులో రూపొందుతున్నాయి.
విద్య, వైద్య రంగాల్లో వీటి వినియోగానికి సంబంధించి అధ్యయనాలు జరుపుతున్నట్టు సంస్థ చెబుతున్నది. ముఖ్యంగా సైకాలజీ కౌన్సెలింగ్‌లు, తొలి దశలో మానసిక సమస్యల్ని అంచనా వేసి చికిత్స అందించడం… లాంటి విషయాలను లోతుగా పరిశీలిస్తున్నట్టూ తెలిపింది. ఇక, ఈ రకం హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసేందుకు మోడల్‌ను, సంక్టిష్టతను బట్టి రెండు వారాల నుంచి నెల రోజుల వరకూ సమయం పడుతుందట. కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ ఇవి ఖరీదు చేస్తున్నాయి. ప్రస్తుతం వీటితో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారట ఆ దేశంలో. మునుముందు వివిధ రంగాల్లో మనుషుల చోటును ఇవి భర్తీ చేయబోతున్నాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదూ!