శనివారం 04 జూలై 2020
Science-technology - Jun 30, 2020 , 17:50:05

భారత యాప్‌లకు భలే గిరాకీ..రొపొసొ యాప్ 12 గంటల్లో కోటి డౌన్‌లోడ్‌లు

భారత యాప్‌లకు భలే గిరాకీ..రొపొసొ యాప్ 12 గంటల్లో కోటి డౌన్‌లోడ్‌లు

న్యూఢిల్లీ: చైనాకు చెందిన పాపులర్‌ మొబైల్‌ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.  టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను బ్యాన్‌ చేయడంతో ప్రస్తుతం ఈ యాప్‌లను వినియోగిస్తున్న వారంతా ప్రత్యామ్నాయ యాప్‌లను  అన్వేషించడం మొదలుపెట్టారు.   నిషేధిత యాప్‌ల ద్వారా చేసే పనులు ఏయే ఇతర యాప్‌ల ద్వారా చేసుకోవచ్చనే దానిపై భారతీయులు విపరీతంగా  సెర్చ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో భార‌తీయులు రూపొందించిన యాప్‌లకు విశేష ఆదరణ లభిస్తున్నది.  

ఫొటో, వీడియో షేరింగ్‌  ‌ ప్లాట్‌ఫామ్‌ రొపొసో  సహ వ్యవస్థాపకుడు మయాంక్‌ భంగాడియా మాట్లాడుతూ.. గడచిన 12 గంటల్లో తమ సంస్థకు చెందిన రొపొసొ యాప్‌ను కోటి మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు. చైనా యాప్‌లపై నిషేధానికి ముందు మా యాప్‌ను 65 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇప్పుడు ప్రతీ గంటకు సగటున 6లక్షల మంది  కొత్త వినియోగదారులు యాప్‌ను ఉపయోగించడం మొదలెట్టారు. మరికొన్ని గంటల్లో 10కోట్ల మైలురాయిని అధిగమిస్తామని మయాంక్‌ ధీమా వ్యక్తం చేశారు. 

టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న దేశీయ తయారీ యాప్‌ చింగారీ యాప్‌కు యూజర్ల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది.  చింగారీ యాప్‌ గంటకు లక్షకు పైగా డౌన్‌లోడ్‌లు అవుతున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు సుమిత్‌ ఘోష్‌ తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారులు ప్రతీ 30 నిమిషాలకు 2,21,000 వీడియోలను వీక్షిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య  3.5 మిలియన్ల దాటిందని చెప్పారు.  

షార్ట్‌ వీడియో షేరింగ్‌ విభాగంలో రొపొసో, చింగారీలకు మంచి క్రేజ్‌ ఉన్నది.  అలాగే, మిగతా సేవలు,రంగాల్లో పేరుగాంచిన భారత్‌కు చెందిన యాప్‌లను భారతీయులు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు.  ఇప్పటి వరకు  తక్కువ మందికి పరిచయం ఉన్న  ట్రెల్‌ యాప్‌ను గత రాత్రి నుంచి ఇప్పటి వరకు 10లక్షల మందికి పైగా ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. 


logo