న్యూఢిల్లీ : మెటా, ట్విట్టర్లో పెద్దసంఖ్యలో లేఆఫ్స్ చేపట్టడంతో పలువురు భారత టెకీలూ ఉద్యోగాలు కోల్పోయారు. మెటా మాస్ లేఆఫ్స్ బారినపడ్డ వారిలో పలువురు టెకీలది ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. ఇక మెటాలో చేరేందుకు ఇటీవల బారత్ నుంచి కెనడా వెళ్లిన హిమాన్షు వి తాజా లేఆఫ్స్‌లో కొలువు కోల్పోయాడు.
హిమాన్షు తన అనుభవాన్ని లింక్డిన్లో షేర్ చేశారు. మెటాలో చేరేందుకు తాను కెనడా వెళ్లానని, చేరిన రెండు రోజులకే కొలువు కోల్పోయానని రాసుకొచ్చాడు. మెటా చేపట్టిన భారీ లేఆఫ్స్‌లో తన జాబ్ పోయిందని, ఇప్పుడు గడ్డు పరిస్ధితిలో ఉన్న వారందరి వెంట తానుంటానని లింక్డిన్ పోస్ట్‌లో ప్రస్తావించాడు.
తాను భారత్, కెనడాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ కోసం ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు. కెనడా, భారత్‌ల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైరింగ్ లేదా ఎలాంటి పొజిషన్ మీకు తెలిసినా తనకు తెలియచేయాలని ఆ పోస్ట్‌లో కోరాడు. 11,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. లేఆఫ్స్‌కు తనదే బాధ్యతని, బాధిత ఉద్యోగులు తనను మన్నించాలని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.