న్యూఢిల్లీ : 2022లో టెక్ కంపెనీలు లేఆఫ్స్‌తో టెకీలను వణికిస్తే 2023 కూడా కొలువుల కోత నిరాటంకంగా కొనసాగనుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ట్విట్టర్ నుంచి మెటా అమెజాన్ వరకూ పలు టెక్ దిగ్గజాలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించగా స్టార్టప్స్ సైతం కొలువుల కోతకు దిగాయి. ఇక సెర్చింజన్ దిగ్గజం గూగుల్ వచ్చే ఏడాదిలో ఏకంగా 10,000 మంది ఉద్యోగులను తొలగించనుందనే రిపోర్ట్స్ టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి.
గూగుల్ లేఆఫ్స్‌ను ఇప్పటివరకూ నిర్ధారించకున్నా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఉద్యోగుల భేటీలో చేసిన వ్యాఖ్యలు లేఆఫ్స్ సంకేతాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగుల సామర్ధ్యాన్ని సమీక్షిస్తున్న సెర్చింజన్ దిగ్గజం పేలవమైన ప్రదర్శన కనబరిచిన వారిని సంస్ధను వీడివెళ్లాలని కోరవచ్చని లేటెస్ రిపోర్ట్స్ పేర్కొన్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని గూగుల్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
నూతన ర్యాంకింగ్, పెర్ఫామెన్స్ ఇంప్రూవ్మెంట్ టూల్ ద్వారా వేలాది మంది సామర్ధ్యం కనబరచని ఉద్యోగులను మేనేజర్లు గుర్తిస్తున్నారని కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. 2023 ప్రధమార్ధంలో ఈ ప్రక్రియను గూగుల్ పూర్తిచేసి సామర్ధ్యం సరిగాలేని 10,000 మంది ఉద్యోగులను సాగనంపుతుందని రిపోర్ట్స్ బాంబు పేల్చాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ ఉంటాయని ఈ నివేదికలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరినాటికి సామర్ధ్యం మెరుగుపరుచుకోవాలని గూగుల్ సీఈఓ ఉద్యోగులను హెచ్చరించడం కూడా ఇదే సంకేతాలను పంపుతోంది. సామర్ధ్యం కనబరచని ఉద్యోగులు లేఆఫ్స్‌కు సిద్ధంగా ఉండాలని గూగుల్‌లో మేనేజర్లు సిబ్బందికి సంకేతాలను పంపుతున్నారు.