Google Pixel 9a | సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవలే పిక్సెల్ సిరీస్‌లో నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. పిక్సెల్ 9ఎ పేరిట గత నెలలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్‌కు గాను ప్రస్తుతం భారత్‌లో అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా పలు లాంచింగ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 9ఎ స్మార్ట్ ఫోన్లో 6.3 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అలాగే ఓలెడ్ హెచ్‌డీఆర్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. 2700 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్ డిస్ప్లేపై అత్యంత నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ కింద పడ్డా అంత సులభంగా పగలదు. ఈ ఫోన్లో గూగుల్ టెన్సార్ జి4 ప్రాసెసర్ ఉంది. ఇది టైటాన్ ఎం2 సెక్యూరిటీని అందిస్తుంది. అందువల్ల ఫోన్‌ను హ్యాక్ చేయడం అంత సులభం ఏమీ కాదు. అలాగే ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 7 ఏళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, ఫీచర్ డ్రాప్ అప్డేట్స్ను అందించనున్నట్లు గూగుల్ తెలియజేసింది. ఇందులో డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ సిమ్ కాగా, మరొకటి ఈ-సిమ్గా పనిచేస్తుంది. మెమొరీ కార్డు స్లాట్ లేదు.
ఫోన్ వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. 48 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న ఇంకో సెకండరీ కెమెరాను కూడా ఇచ్చారు. దీంతోపాటు 13 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న అల్ట్రా వైడ్ కెమెరా కూడా వెనుక భాగంలో ఉంది. ఈ కెమెరాలతో 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో కూడా 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ లభిస్తుంది. యూఎస్బీ టైప్ సి ఆడియోను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈని ఉపయోగించుకోవచ్చు. వైఫై 6, బ్లూటూత్ 6, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. 5100 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఈ ఫోన్లో ఉంది. దీనికి 28 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 7.5 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
గూగుల్ పిక్సెల్ 9ఎ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్‌నే ప్రస్తుతం విక్రయిస్తున్నారు. 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ను త్వరలో అందుబాటులో ఉంచనున్నారు. 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.49,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆఫ్ లైన్ రీటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు. పిక్సెల్ 9ఎ స్మార్ట్ ఫోన్‌పై హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో రూ.3000 వరకు పరిమిత కాల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం 24 నెలల వరకు ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ ఛేంజ్‌పై రూ.2000 వరకు అదనపు బోనస్‌ను అందిస్తున్నారు.