Google Pixel 10 Pro Fold | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా పిక్సల్ 10 సిరీస్‌లో నూతన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. ఇక ఇదే కోవలో ఓ నూతన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను సైతం గూగుల్ లాంచ్ చేసింది. పిక్సల్ 10 ప్రొ ఫోల్డ్ పేరిట ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో లేటెస్ట్ గూగుల్ టెన్సార్ జి5 చిప్‌ను ఏర్పాటు చేయగా 8 ఇంచుల అతి పెద్ద డిస్ప్లే లభిస్తుంది. ఇది ఎల్టీపీవో ఓలెడ్ డిస్ప్లే కాగా దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఇక మడతబెట్టినప్పుడు 6.4 ఇంచుల డిస్ప్లేను వాడుకోవచ్చు. ఇది ఓలెడ్ డిస్ప్లేగా పనిచేస్తుంది. దీనికి కూడా 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. సూర్యకాంతిలోనూ డిస్ప్లే స్పష్టంగా కనిపించే విధంగా 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను అందిస్తున్నారు.
ఈ ఫోన్‌కు గాను ఫ్లుయిడ్ ఫ్రిక్షన్ హింజ్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్‌ను మడతబెట్టడం, ఓపెన్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. పూర్తిగా ఓపెన్ చేసినప్పుడు కేవలం 5.2 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కనుక స్లీక్ ఫీలింగ్ వస్తుంది. ఈ ఫోన్ బాడీని పూర్తిగా మల్టీ అలాయ్ స్టీల్‌తో రూపొందించారు. దీని తయారీకి గాను ఎరోస్పేస్ గ్రేడ్ హై స్ట్రెంగ్త్ అల్యూమినియం అలాయ్ ను ఉపయోగించారు. ఫోన్ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే సిల్కీగా ఉంటుంది. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అలాగే ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్‌కు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా దీన్ని సెల్ఫీ కెమెరాగా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే మరో 10.5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను, 10.8 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాను ఇచ్చారు. దీనిఇ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్ లభిస్తుంది. అందువల్ల చాలా దూరం నుంచి కూడా ఫొటోలు, వీడియోలను అద్భుతంగా చిత్రీకరించుకోవచ్చు.
ఈ ఫోన్లో 5015 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 23 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్తోపాటు, 15 వాట్ల వైర్ వెస్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌ను అమర్చారు. అందువల్ల ఫోన్ హ్యాకర్ల బారి నుంచి సురక్షితంగా ఉంటుంది. 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఈ ఫోన్‌కు 10 మెగాపిక్సల్ ఫ్రంట్ అండ్ ఇన్నర్ కెమెరాలను సైతం ఇచ్చారు. 4కె వీడియోలను అద్భుతంగా చిత్రీకరించుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. వైఫై 7 లభిస్తుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా అందుబాటులో ఉంది. బ్లూటూత్ 6.0 ఎల్ఈ, యూఎస్బీ టైప్సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
గూగుల్ పిక్సల్ 10 ప్రొ ఫోల్డ్ ఫోన్‌ను మూన్ స్టోన్, జేడ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన కేవలం 256జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను మాత్రమే భారత్‌లో విక్రయిస్తున్నారు. దీని ధర రూ.1,72,999గా ఉంది. అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధరను 1799 డాలర్లు (దాదాపుగా రూ.1,56,590)గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అక్టోబర్ నుంచి విక్రయించనున్నారు.