Google India Store | మీరు గూగుల్ పిక్సల్ ఫోన్లను లేదా ఆ కంపెనీకి చెందిన ఇతర ఏవైనా వస్తువులను కొనాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే గూగుల్ తాజాగా భారత్‌లో తన స్టోర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దీంతో వినియోగదారులు ఇక నుంచి నేరుగా గూగుల్ స్టోర్‌లోనే తమకు కావల్సిన గూగుల్ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దీంతో అనేక ఆఫర్లను అందుకోవడంతోపాటు కస్టమర్ సపోర్ట్ కూడా ఇకపై మరింత నాణ్యంగా లభిస్తుందని గూగుల్ తెలియజేసింది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటనను విడుదల చేసింది. గూగుల్ ఇండియా స్టోర్‌లో వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నారు. స్టోర్ డిస్కౌంట్లతోపాటు గూగుల్ స్టోర్ క్రెడిట్, ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి సదుపాయాలను అందిస్తున్నారు.
గూగుల్ స్టోర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు తమ యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ లేదా ఇతర ఏదైనా కంపెనీకి చెందిన ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసి గూగుల్ పిక్సల్ ఫోన్లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు గాను క్యాషిఫై అనే సంస్థతో భాగస్వామ్యం అయినట్లు గూగుల్ తెలియజేసింది. మీకు కావల్సిన ఏదైనా పిక్సల్ ఫోన్‌ను ముందుగా గూగుల్ ఇండియా స్టోర్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. దానికి మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే ఎంత వస్తుందో ఉజ్జాయింపుగా చెబుతారు. అప్పుడు మీ ఫోన్‌ను పికప్ చేసుకోవాల్సిందిగా ఒక షెడ్యూల్ పికప్ క్రియేట్ చేయాలి. తరువాత కొత్త పిక్సల్ ఫోన్‌ను అందించి మీ పాత ఫోన్‌ను తీసుకుంటారు. ఎక్స్చేంజ్ పోను ఇంకా ఏమైనా పెండింగ్ మొత్తం ఉంటే వినియోగదారుడు చెల్లించాలి. ఇలా గూగుల్ స్టోర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది.
గూగుల్ స్టోర్ ద్వారా గూగుల్ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసేవారు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుల సహాయంతో ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. 24 నెలల వరకు ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. పలు ఎంఎపిక చేసిన పిక్సల్ ఫోన్లపై ఏకంగా 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. పిక్సల్ బడ్స్ ప్రొ 2, పిక్సల్ వాచ్ 3 డివైస్‌లపై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ స్టోర్‌లో కస్టమర్లు యూపీఐ ద్వారా కూడా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.
పిక్సల్ ఫోన్లు లేదా ఇతర ఏవైనా డివైస్‌లను కొనుగోలు చేసిన కస్టమర్లకు రోజులో 24 గంటలూ కస్టమర్ సపోర్ట్‌ను ఈ స్టోర్ ద్వారా అందిస్తున్నట్లు గూగుల్ తెలియజేసింది. ఇక స్టోర్ లాంచింగ్ సందర్భంగా పిక్సల్ ఫోన్లపై, ఇతర గ్యాడ్జెట్లపై ఆకట్టుకునే డిస్కౌంట్లను అందిస్తున్నారు. పిక్సల్ 9ఎ ఫోన్‌పై రూ.3వేల ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఇస్తారు. పిక్సల్ 9 ఫోన్‌పై రూ.7వేల క్యాష్ బ్యాక్, రూ.10వేల స్టోర్ క్రెడిట్‌ను ఇస్తారు. పిక్సల్ 9 ప్రొ ఫోన్‌పై రూ.10వేల క్యాష్ బ్యాక్, రూ.10వేల స్టోర్ క్రెడిట్‌ను ఇస్తున్నారు. పిక్సల్ 9 ప్రొ ఎక్స్ఎల్ ఫోన్‌పై రూ.10వేల క్యాష్ బ్యాక్, రూ.10వేల గూగుల్ స్టోర్ క్రెడిట్‌ను ఇస్తుండగా, పిక్సల్ 9 ప్రొ ఫోల్డ్‌పై రూ.10వేల క్యాష్ బ్యాక్, రూ.12వేల స్టోర్ క్రెడిట్‌ను పొందవచ్చు. అదే పిక్సల్ వాచ్ 3 ని కొంటే రూ.5వేల స్టోర్ క్రెడిట్ లభిస్తుంది. పిక్సల్ బడ్స్ ప్రొ 2ను కొంటే రూ.3వేల స్టోర్ క్రెడిట్ ఇస్తారు.