Google AI Plus | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పటికే జెమిని, నానో బనానా పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సేవలను అందిస్తున్న విషయం విదితమే. ఈ సేవలు ప్రస్తుతం భారత్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేవలకు చెందిన బేసిక్ ఫీచర్లను వాడుకోవాలంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవపరం లేదు. కానీ అడ్వాన్స్డ్ ఫీచర్లను ఉపయోగించుకోవాలంటే మాత్రం నెలకు దాదాపుగా రూ.2వేల వరకు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈ రుసుము మరీ అధికంగా ఉండడంతో పెద్ద ఎత్తున యూజర్లు కేవలం ఒక నెల ట్రయల్ ను మాత్రమే వాడుకుంటున్నారు. తరువాత గూగుల్ ఏఐ ప్రొ సేవలను పొందడం లేదు. దీన్ని గమనించిన గూగుల్ మరింత మంది యూజర్లకు తమ సేవలను అందించేందుకు గాను ఓ నూతన ప్లాన్‌ను కేవలం భారత యూజర్ల కోసమే లాంచ్ చేసింది. గూగుల్ ఏఐ ప్లస్ పేరిట ఓ నూతన ప్లాన్‌ను ప్రవేశపెట్టారు.
గూగుల్ ఏఐ ప్లస్ ప్లాన్‌ను ముందుగా గత సెప్టెంబర్ నెలలో ఇండోనేషియాలో ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో భారత యూజర్ల కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు నెలకు రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో గూగుల్ ఏఐ ప్లస్ ఫీచర్లను పొందవచ్చు. అయితే గూగుల్ ఏఐ టూల్స్‌కు మొదటిసారిగా సబ్స్క్రిప్షన్ తీసుకునే వారికి మాత్రం ఈ ప్లాన్‌ను నెలకు రూ.199 కే మొదటి 6 నెలల పాటు అందిస్తున్నారు. కనుక యూజర్లు ఇప్పటి వరకు గూగుల్ ఏఐ టూల్స్ కు సబ్స్క్రిప్షన్ ను తీసుకోకపోతే ఈ ఆఫర్ కింద నెలకు కేవలం రూ.199కే మొదటి 6 నెలల పాటు గూగుల్ ఏఐ ప్లస్ ప్లాన్‌ను ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో భాగంగా పలు ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.
గూగుల్ ఏఐ ప్లస్ ప్లాన్‌లో భాగంగా యూజర్లు గూగుల్‌కు చెందిన అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. జెమిని 3 ప్రొ లేటెస్ట్ మోడల్‌ను జెమిని యాప్‌లో వాడుకోవచ్చు. అలాగే ఇమేజ్ ఎడిటింగ్ లేదా క్రియేషన్ కోసం అధునాతన నానో బనానా ప్రొ సేవలను వాడుకోవచ్చు. అదేవిధంగా పనిచేసే ఉద్యోగులు తమ గూగుల్ అకౌంటలోని జీమెయిల్, డాక్స్ వంటి గూగుల్ యాప్‌లలో ఏఐ టూల్స్‌ను ఇంటిగ్రేట్ చేసి ఉపయోగించవచ్చు. దీంతో పని చాలా సులభతరం అవుతుంది. అలాగే డీప్ రీసెర్చ్ కోసం నోట్‌బుక్ ఎల్ఎం టూల్‌ను సైతం ఈ ప్లాన్‌లో భాగంగా పొందవచ్చు. ఇక ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు 200 జీబీ క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ ఉచితంగా లభిస్తుంది. దీన్ని గూగుల్ సేవలు అన్నింటిలోనూ వాడుకోవచ్చు. జీమెయిల్, ఫొటోలు, డ్రైవ్ వంటి యాప్స్‌కు ఈ స్టోరేజ్ షేర్ అవుతుంది.
ఇక గూగుల్ ఏఐ ప్లస్ ప్లాన్‌ను స్టాండర్డ్ ప్లాన్‌గా అందిస్తున్నారు. కానీ దీన్ని యూజర్లు తమ ఫ్యామిలీ మెంబర్లు ఐదు మందితో షేర్ చేసుకోవచ్చు. దీంతో ఆ స్టోరేజ్ స్పేస్ వారికి కూడా షేర్ అవుతుంది. ఇలా గూగుల్ ఏఐ ప్లస్ ప్లాన్‌ను యూజర్లు ఉపయోగించుకోవచ్చు.