Facebook | సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో ప్రతి ఒక్కరికీ ఖాతా ఉందంటే అతి శయోక్తి కాదు.. భారత్‌లో ఎంటరైన కొద్దికాలంలోనే అందరి ఆదరాభిమానాలు సంపాదించుకున్న ఫేస్బుక్.. ఇంటర్నెట్ గురించి తెలిసివారందరికి దగ్గరైంది. కొన్నేండ్లుగా అత్యంత పాపులారిటీ పొందిన ఫేస్‌బుక్‌కు భారీ షాక్ తగిలింది. 2021 చివరి త్రైమాసికంలో చురుగ్గా ఫేస్బుక్ వాడే ఖాతాదారులు తగ్గిపోయారు. దీనికి మొబైల్ డేటా రేట్లు పెరగడమే కారణం అని ఫిబ్రవరిలో ఫేస్బుక్ అధికార ప్రతినిధి తెలిపారు. కానీ ఫేస్బుక్ అంతర్గతంగా రూపొందించిన నివేదిక సంస్థ యాజమాన్యానికి షాక్ ఇచ్చింది.
భారత్‌లో ఫేస్బుక్ ఖాతా రెగ్యులర్‌గా ఓపెన్ చేయడానికి మహిళలు వెనుకాడుతున్నారని ఈ నివేదిక తేల్చి చెప్పింది. భారతీయ మహిళలు తమ భద్రత, గోప్యతపై భయం వెంటాడుతున్నదని, అందుకే ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నారని తేలింది. అసలే ఫేస్బుక్లో పురుషులదే ఆధిక్యత అని కూడా మహిళలు అన్నట్లు ఫేస్బుక్ అంతర్గత నివేదిక వివరించింది.
రెండేండ్ల క్రితం ఇంటర్నెట్ వాడకం దారుల్లో 62 శాతం మంది పురుషులు ఉంటే.. గతేడాది 75 శాతానికి పెరిగింది. ఇది ఇంటర్నెట్ వాడకందారుల్లో లింగ అసమానత్వం స్పష్టంగా కనిపిస్తున్నదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. చాలా కుటుంబాలు తమ ఇంటి మహిళలు ఫేస్‌బుక్‌లోకి రావడానికి అనుమతించడం లేదని మెటావర్స్ రూపొందించిన ఈ అంతర్గత నివేదిక తెలిపింది. దీనికి తోడు సగటున 20-30 శాతం మంది మహిళలు.. వారానికోసారి తమ ఫేస్బుక్ వాల్‌పై అశ్లీల దృశ్యాలు కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేశారని పేర్కొన్నది.
భారత్‌లో ఓ మహిళ చీర కట్టుకుని ముఖానికి ముసుగేసుకున్న ఫొటో అప్లోడ్ చేస్తే సుమారు 367 మంది ఆగంతకుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వచ్చాయని తెలిపింది. చాలా బాగున్నావ్, ఎక్కడుంటావ్ అని కామెంట్లు కూడా చేశారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రొఫైల్ లాక్ ఆప్షన్ అమల్లోకి తెచ్చాక.. ఇటువంటి కామెంట్లు తగ్గాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ఖాతాదారులుగా ఉన్న మహిళలందరి నుంచి ఇదే ఫిర్యాదు రావడంతో సంస్థ యాజమాన్యం ప్రొఫైల్ లాక్ ఆప్షన్ తీసుకొచ్చింది.
2020లో భారత్‌లో ప్రొఫైల్ లాక్ ఆప్షన్ ప్రారంభించింది. ఇప్పటివరకు 34 శాతం మంది మహిళలు ఈ ప్రొఫైల్ లాక్ ఆప్షన్ ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఫేస్బుక్లో మహిళలు అభద్రతాభావానికి గురవుతున్నారని తెలుస్తున్నది. దీనిపై ఫేస్బుక్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. తమ సంస్థ పురోగతిపై అంతర్గత నివేదికలు తయారు చేస్తామని, అలాగని ప్రతికూల నిర్ణయానికి రాలేమన్నారు.