Mumbai Expressway : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టెంపోను ట్రక్కు ఢీకొనడంతో ఎనిమిది మంది మహిళలు మరణించారు. ఈ ఘటన నాగ్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై బుధవారం జరిగింది. మృతులంతా కూలీలే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన 10 మంది మహిళా కూలీలు బుధవారం సాయంత్రం పని ముగించుకుని టెంపోలో ఇంటికి బయల్దేరారు.
ఈ క్రమంలో నాగ్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై టెంపో బయల్దేరుతుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు ఆ వాహనాన్ని ఢీకొంది. వాహనం ఢీకొనడంతో 10 మంది మహిళలతోపాటు డ్రైవర్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మిగతా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కడ్వాంచి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. నలుగురు క్షతగాత్రులను చికిత్స కోసం జల్నాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
మిగతా ముగ్గురికి చికిత్స కొనసాగుతోంది. బాధితులంగా జల్నా తహసీల్‌కు చెందినవారే. ఈ ఘటనకు బాధ్యుడైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.