Naya Mall | ఐఫోన్ మ్యాజిక్
చేతిలో ఐఫోన్ ఉన్నదంటే.. ప్రొఫెషనల్ కెమెరా కూడా ఉన్నట్టే! అధునాతన ఐఫోన్ 15 మాడళ్లలోని 48 ఎంపీ కెమెరాతో.. 4కే రిజల్యూషన్‌తో వీడియోలు తీయొచ్చు. అయితే, ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఫోన్లలో ఫీచర్లు, ఆప్షన్లు తక్కువే! థర్డ్ పార్టీ యాప్స్ కూడా పరిమితమే! ఈ లోటును పూడ్చటానికి బ్లాక్ మ్యాజిక్ డిజైన్ సంస్థ.. ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ‘బ్లాక్‌మ్యాజిక్ కెమెరా’ పేరుతో వచ్చిన ఈ యాప్‌లో.. ప్రొఫెషనల్ కెమెరాలకు తీసిపోని ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ‘వన్‌టచ్’తోనే అన్ని రకాల సెట్టింగ్స్.. ఫ్రేమ్స్ పర్ సెకన్, ఐఎస్ఓ, షటర్ యాంగిల్స్‌ను మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఈ యాప్ ద్వారా 4కే వీడియోలను నేరుగా బ్లాక్ మ్యాజిక్ క్లౌడ్‌లో రికార్డు చేయవచ్చు. ప్రపంచంలోని ఏ కంప్యూటర్‌లోనైనా ఆ వీడియోను ఎడిట్ చేసుకోవచ్చు. ఐఫోన్ కెమెరాకు అదనపు హంగులు అద్దే ఈ ‘బ్లాక్ మ్యాజిక్ కెమెరా’ యాప్.. ఉచితం. apple.com, blackmagicdesign.com వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇల్లే.. సినిమా హాలు
‘కరోనా’ తర్వాత ప్రజలు థియేటర్లకు రావడం తగ్గింది. అదే సమయంలో ఓటీటీల హవా కూడా పెరిగింది. దీంతో.. చాలామంది కొత్త సినిమాలను ఇంట్లోనే చూస్తున్నారు. అయితే, ఇంట్లో ఎంత ఖరీదైన స్మార్ట్‌టీవీ ఉన్నా.. థియేటర్లో సినిమా చూసిన అనుభూతిని కోల్పోతున్నారు. కొందరైతే.. ప్రొజెక్టర్లను కొనుగోలు చేసి, ఇంటినే సినిమా హాల్‌గా మార్చేసుకుంటున్నారు. అలాంటివారికి మంచి ఆప్షన్.. ‘ఆప్టొమా టీవీ ఎల్1 ప్లస్’ ఎల్ఈడీ ప్రొజెక్టర్. ఆండ్రాయిడ్ టీవీ డాంగిల్‌తో వస్తున్న ఈ షార్ట్ త్రూ ప్రొజెక్టర్‌లో.. స్మార్ట్‌టీవీకి ఏమాత్రం తీసిపోని ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ సహా అన్ని ప్రముఖ ఓటీటీ యాప్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ నుంచి నచ్చిన యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇక ఇందులోని 4 ఎల్ఈడీ టెక్నాలజీ ద్వారా 120 అంగుళాల స్క్రీన్‌పై 4కే రిజల్యూషన్‌లో, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో సినిమాలను ఆస్వాదించవచ్చు. థియేటర్లో ఉన్నామనే అనుభూతి కలిగించే ఈ ఎల్ఈడీ ప్రొజెక్టర్ వెల.. రూ. 2,80,000. అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు optoma.co.inలో లభిస్తుంది.
కారు.. సరికొత్త షికారు
కాలంతోపాటు కారూ మారుతున్నది. కారులో సౌకర్యాలూ మారుతున్నాయి. ఒకప్పుడు పాటలకే పరిమితమైన కార్ స్టీరియో సిస్టం.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు దీటుగా తయారైంది. వుడ్మ్యాన్ సంస్థ.. అత్యాధునిక సౌకర్యాలతో ‘ఎక్స్9’ మాడల్ కార్ స్టీరియోను పరిచయం చేసింది. 1280×720 పిక్సెల్ క్యూఎల్ఈడీ డిస్ప్లేను ఇందులో అమర్చింది. అయితే, కార్ మాడల్‌ను బట్టి స్క్రీన్ సైజ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కార్టెక్స్
ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండానే నేవిగేషన్ మ్యాప్స్ లోడ్ అవుతాయి. ఆండ్రాయిడ్ 10 వర్షన్‌పై పనిచేసే ఈ స్టీరియోను గూగుల్ వాయిస్‌తోనూ నియంత్రించవచ్చు. 32 జీబీ స్టోరేజీ, 4జీ సిమ్ స్లాట్, వైఫై, టచ్‌స్క్రీన్, 60 వాట్స్ హైబాస్ సౌండ్.. ఇందులో అదనపు సౌకర్యాలు. కెమెరా వ్యూయర్, మ్యూజిక్ సిస్టమ్, నేవిగేటర్గానే కాకుండా.. స్మార్ట్‌ఫోన్‌గానూ ఉపయోగపడే ‘వుడ్మ్యాన్ ఎక్స్9’ ధర.. మాడల్‌ను బట్టి రూ.20 వేల వరకూ ఉన్నది. hiwoodman.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
వాంట్ ఇట్.. ప్రింట్ ఇట్
పిల్లల ప్రాజెక్ట్ వర్క్ మొదలుకొని.. ఏ డాక్యుమెంట్ అవసరమైనా, జిరాక్స్ సెంటర్ల దగ్గరికి పరిగెత్తాల్సిన పన్లేదు. స్మార్ట్‌ఫోన్‌లో దిగిన ఫొటోలను.. స్టూడియోకు వెళ్లి ప్రింట్ తీయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హెచ్‌పీ తయారుచేసిన ‘స్మార్ట్ట్యాంక్ 5101’ ఆల్ ఇన్ వన్ ప్రింటర్ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే చాలు. ప్రింటర్, స్కానర్, ఫొటోకాపీ.. ఇలా అన్ని పనులనూ చక్కబెట్టేస్తుంది. వైర్లెస్ టెక్నాలజీ ద్వారా కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ నుంచి కూడా నేరుగా డాక్యుమెంట్లను ప్రింట్ తీసుకునే అవకాశం ఉంది. రెండేళ్లకు సరిపడా రంగుల బాక్స్‌తో వచ్చే ఈ కలర్ ప్రింటర్ సాయంతో.. ఫొటోలనూ ప్రింట్ చేసుకోవచ్చు. పిల్లలతోపాటు పెద్దల అవసరాలనూ తీర్చే ఈ స్మార్ట్ ప్రింటర్ ఖరీదు.. రూ. 15,775. hp.com తోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో దొరుకుతుంది.