Digital Break | మద్యం కాలేయాన్ని, ధూమపానం ఊపిరితిత్తులను నాశనం చేస్తాయి. కానీ స్మార్ట్‌ఫోన్ వ్యసనం.. మొత్తంగా జీవితాన్ని బలి తీసుకుంటుంది. బంధాలపై బందూకు గురిపెడుతుంది. కెరీర్‌ను దెబ్బతీస్తుంది. మనకు, ప్రపంచానికి మధ్య ఓ వర్చువల్ అగాధం సృష్టిస్తుంది. కాబట్టి ఆ వ్యసనాన్ని ఓడించండి. జీవితాన్ని గెలిపించండి. తాజా గణాంకాల హెచ్చరిక కూడా ఇదే.
రోజుకు ఆరుగంటలా ఇరవై ఆరు నిమిషాలు ఇంటర్నెట్తోనే సహవాసం చేస్తున్నాం మనం. పదికోట్ల పైచిలుకు నెట్ వినియోగదారుల్లో తొంభై ఆరు శాతానికిపైగా ఆన్లైన్ వీడియోలు చూస్తున్నారు. ఎనభైరెండు శాతం మంది ఆన్లైన్ స్ట్రీమింగ్కు అలవాటు పడిపోయారు. యాభైరెండు శాతం మంది ఎఫ్ఎమ్ రేడియో ఆలకిస్తారు. యాభైశాతం పాడ్‌కాస్ట్ ప్రేమలో పడ్డారు. ఈ కార్యకలాపాలన్నిటికోసం ఎనభై ఆరు శాతం మంది స్మార్ట్ఫోన్లనే వాడుతున్నారు. ఇప్పటికైనా అర్థమైందా? స్మార్ట్‌ఫోన్ మన జీవితాల్ని ఎలా కబ్జా చేస్తున్నదో. ఆ ఆరుగంటల పైచిలుకు సమయంలో కనీసం మూడోవంతు కుటుంబానికి కేటాయించినా బంధాలు బలపడతాయి. స్నేహితులకూ కొంత కేటాయిస్తే అనుబంధాలు వికసిస్తాయి. ఏ పుస్తకమో చదివితే కొత్త ఆలోచనలు అంకురిస్తాయి. స్మార్ట్‌ఫోన్ జాడ్యాన్ని వదిలించుకోమని ఇప్పటికే చాలామంది మానసిక నిపుణులు హెచ్చరించారు. అధ్యయనాలు నొక్కి చెప్పాయి. మన సమయాన్నే కాదు.. జీవితాన్నీ బజారుకీడుస్తున్నదీ దురలవాటు. సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వ్యక్తిగత వివరాలు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ కంటే కూడా స్మార్ట్‌గా ఆలోచించినప్పుడే.. ఈ ముప్పును తప్పించుకోగలం. హాయిగా బతికేయగలం.
స్మార్ట్‌ఫోన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీ పనులకు అవరోధం కాకూడదు. మీ ఏకాగ్రతను దెబ్బతీయకూడదు, మీ నిద్రను పాడుచేయకూడదు, మీ ప్రాతఃకాలాన్ని మింగేయకూడదు. మనం చెప్పినట్టు అది వినాలి కానీ, అది ఆడించినట్టు మనం ఆడకూడదు. చిన్నపాటి సెల్ఫ్ చెక్ ద్వారా మీరు స్మార్ట్‌ఫోన్‌కు ఏ మేరకు బానిసలు అయిపోయారన్నది జేరీజు వేసుకోవచ్చు. ఇవీ ఆ లక్షణాలు..
☞ ఓ పది నిమిషాలు సెల్‌ఫోన్ కనిపించకపోయినా ఒత్తిడికి, విపరీతమైన ఆందోళనకు గురికావడం.
☞ ఐదు నిమిషాలకోసారి ఫోన్ చెక్ చేసుకోవడం.
☞ తరచూ పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం, రీషేర్ చేసుకోవడం, లైక్స్ కొట్టడం. ఇతరులు కూడా అంతే వేగంగా స్పందించాలని కోరుకోవడం.
☞ సోషల్ మీడియా కోసమే అర్ధరాత్రి దాకా మేల్కోవడం, తెల్లవారుజామునే నిద్రలేవడం.
☞ చేసే పనిమీద ఏకాగ్రత తగ్గిపోయి, స్మార్ట్‌ఫోన్ మీదే దృష్టిపెట్టడం.
☞ వచ్చే ప్రతి నోటిఫికేషన్‌కూ స్పందించి వెనువెంటనే చెక్ చేసుకోవడం.
స్మార్ట్‌ఫోన్‌తో మీరు గడిపే సమయం పెరుగుతున్న కొద్దీ, సైబర్ నేరగాళ్ల దృష్టిలో పడే అవకాశాలూ అధికం అవుతాయి. మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. నలుగురికీ తెలిస్తే పరువు పోతుందనే భయం, సమాజంలో చులకన అవుతామనే బిడియం, మరీ పెద్ద మొత్తాలు కావనే నిర్లక్ష్యం, ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని అజ్ఞానం.. అన్నీ కలిసి సైబర్ నేరగాళ్లకు కొత్త బలాన్ని ఇస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కాలక్షేపాన్ని అదుపులో ఉంచుకుంటే, సైబర్ నేరాలనూ నియంత్రించవచ్చు. మీకు అందే ఫొటోలు డీప్ ఫేక్ కావచ్చు. మీకు వచ్చే ఎస్సెమ్మెస్‌లు ఓ కుట్రలో భాగం కావచ్చు. జాగ్రత్తగా స్పందించండి. ఏ మాత్రం అనుమానం వచ్చినా సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయడం మరిచిపోవద్దు.
ఓ అలవాటుగా మొదలై వ్యసనంగా మారి.. తీవ్ర వ్యసనంగా పరిణమించిందంటే.. ఇక, మన జీవితం మన చేతుల్లో ఉండదు. మన ఆలోచనలు మన పరిధిలో ఉండవు. అందులోనూ డిజిటల్ వ్యసనం.. మద్యం కంటే మత్తునిస్తుంది, మాదక ద్రవ్యంలా బానిసను చేసుకుంటుంది. కాబట్టి, ఆదిలోనే అరికట్టాలి.
☞ అనవసరమైన అలర్ట్‌లు, నోటిఫికేషన్లను తీసేయండి. దీనివల్ల ఇంట్లో నిద్రాభంగం ఉండదు. ఆఫీసులో పనికి ఇబ్బంది ఉండదు.
☞ పడకగదిని స్మార్ట్‌ఫోన్ ఫ్రీ జోన్‌గా మార్చేయండి. ఈ నిబంధన ఆలూమగలు ఇద్దరికీ వర్తిస్తుంది.
☞ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని బెడ్రూమ్లో చార్జ్ చేసుకోడానికి కూడా వీలులేదు.
☞ స్మార్ట్‌ఫోన్ కాకుండా.. సోషల్ మీడియా కోసం డెస్క్‌టాప్ ఉపయోగించండి. ఎక్కువ సేపు స్థిరంగా కూర్చోవడం కష్టం కాబట్టి, త్వరగా లాగ్ అవుట్ అవుతారు.
☞ స్మార్ట్‌ఫోన్ హోమ్ స్క్రీన్ మీద ముఖ్యమైన టూల్స్ మాత్రమే ఉంచుకోండి.
☞ భోజన సమయంలో, ఆత్మీయుల భేటీలో సెల్‌ఫోన్ చొరబాటును నిషేధించండి.
☞ స్క్రీన్ టైమ్ యాప్స్లాంటివి స్మార్ట్‌ఫోన్ కోసం మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు అనేది తెలియజేస్తాయి. అదొక హెచ్చరికలా పనిచేస్తుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
☞ స్మార్ట్‌ఫోన్ కోసం కేటాయిస్తున్న సమయాన్ని నియంత్రించుకుని.. గ్రీన్టైమ్కు మళ్లించండి. ఆన్లైన్ ఆటల నుంచి మైదాన క్రీడలకు మరలండి.
☞ స్మార్ట్‌ఫోన్‌ను గ్రే స్కేల్ మోడ్‌లో ఉంచుకుంటే.. ఎక్కువ సేపు తదేకంగా చూడలేం.
☞పెళ్లిరోజు, పుట్టినరోజు తదితర ప్రత్యేక సందర్భాల్లో సోషల్ మీడియా పోస్టులకు పరిమితం కాకుండా ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు చెప్పండి. బంధాలను మరింత పదిలం చేసుకోండి.
☞ ఆఫీసులో సోషల్ మీడియా అప్డేట్స్, వాట్సాప్ చాట్స్‌తో కాలక్షేపం చేయడం కెరీర్‌కే ప్రమాదం.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Tech Tips | ఫేస్బుక్లో స్పామర్ల బారిన పడి మోసపోవద్దంటే ఈ టిప్స్‌ను కచ్చితంగా పాటించండి
Tech Tips | మీ ఫోన్ పోయిందా? సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే ఈ జాగ్రత్తలు మస్ట్!