Jio AirFiber | టెలికం రంగంలో సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు రిలయన్స్ జియో. టెలీ కమ్యూనికేషన్స్‌లో అనునిత్యం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జియో.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జియో గిగా ఫైబర్ పేరిట బ్రాడ్‌బ్యాండ్ సేవలందిస్తున్న జియో.. ఈ సేవల విస్తరించతలపెట్టింది. కొత్తగా తమ వినియోగదారులకు జియో ఎయిర్ ఫైబర్ ( Jio Air Fiber ) తెస్తున్నట్లు సోమవారం రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. అసలు ఎయిర్ ఫైబర్ అంటే ఏమిటి? ఎలా పని చేస్తుందో తెలుసుకుందామా..!
మూడేండ్ల క్రితం 2019లో ఫైబర్ సేవలు అందుబాటులోకి తెచ్చింది జియో. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల వాసులు ఈ సేవలు పొందుతున్నారు. దేశవ్యాప్తంగా 11 లక్షల కి.మీ పొడవునా ఫైబర్ నెట్వర్క్ నిర్మించామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. కానీ, ఇప్పటికీ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ నెట్వర్క్ విస్తరించని ప్రాంతాల్లో జియో ఫైబర్ సేవలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో కేబుల్స్‌తో సంబంధం లేకుండా ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభిస్తామని జియో తెలిపింది. జియో ఎయిర్ ఫైబర్ ( Jio AirFiber ) ఒక అల్ట్రా హైస్పీడ్ 5జీ హాట్‌స్పాట్ డివైజ్( Jio AirFiber an ultra-high-speed 5G hotspot device ).
మామూలుగా ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందొచ్చు. ఈ సేవలు పొందాలంటే వైర్‌తోపాటు మోడెం ఉపయోగించాలి. జియో గిగా ఫైబర్ ఈ తరహాలో తన కస్టమర్లకు సేవలు అందిస్తున్నది. జియో ఎయిర్ ఫైబర్ సేవలకు కేబుల్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక సింగిల్ డివైజ్. ఇది ఏర్పాటు చేసుకున్న ప్రాంతానికి దగ్గర్లో గల జియో టవర్స్ నుంచి సిగ్నల్స్ లభిస్తాయి. దీని ద్వారా సాధారణ బ్రాడ్ బ్యాండ్ మాదిరిగానే వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు పొందొచ్చునని జియో పేర్కొంది.
ఇండ్లలో గానీ, ఆఫీసుల్లో గానీ ఎక్కడైనా జియో ఎయిర్ ఫైబర్ డివైజ్‌ను వాడొచ్చు. ఎటువంటి ఫైబర్ వైర్లు లేకుండా ఆల్ట్రా హైస్పీడ్ 5జీ హాట్‌స్పాట్ ( ultra-high-speed 5G hotspot ) డివైజ్ జియో ఎయిర్ ఫైబర్ ( Jio AirFiber )తో ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. దీంతో క్రికెట్ మ్యాచ్‌లపై మల్టీపుల్ వీడియో స్ట్రీమింగ్ అనుభూతి పొందొచ్చు. పలు కెమెరాల కోణాల్లో ఆల్ట్రా హై డెఫినేషన్తో మ్యాచ్‌లు వీక్షించొచ్చునని జియో తెలిపింది. ఫైబర్ నెట్వర్క్ లేకుండా అతి తక్కువ కాలంలో వందలాది ఇండ్లు, ఆఫీసులకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెచ్చే సాధనమే జియో ఎయిర్ ఫైబర్.
గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలందించే లక్ష్యంతో ఇప్పటికే ఎయిర్ ఫైబర్ సేవలను ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అందిస్తున్నది. 2020లో ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన రెండేండ్ల తర్వాత జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందుబాటులోకి తెస్తున్నది. ఇప్పటికే టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్తోపాటు టెలికం సంస్థలకు సవాల్ విసిరింది జియో. తాజాగా ఎయిర్ ఫైబర్ సేవలతో మరోమారు బీఎస్ఎన్ఎల్కు రిలయన్స్ జియో గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది.
ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ సేవల్లో భారత్‌ది 138వ ర్యాంక్. ఈ ర్యాంక్‌ను టాప్-10లోకి జియో తీసుకెళ్లగలదని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. అంటే, భారీ స్థాయిలో ఎయిర్ ఫైబర్ సేవలను రిలయన్స్ జియో విస్తరించబోతున్నది. ఈ ఎయిర్ ఫైబర్ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, ఫైబర్ టారిఫ్ ప్లాన్స్ వివరాలు దీపావళి కల్లా వినియోగదారులకు వెల్లడవుతాయని భావిస్తున్నారు. దీపావళికి ఎయిర్ ఫైబర్ సేవలు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో అందుబాటులోకి తేవాలని జియో ప్లాన్ చేస్తున్నది.