e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సంగారెడ్డి తొలిరోజు పకడ్బందీగా లాక్‌డౌన్‌

తొలిరోజు పకడ్బందీగా లాక్‌డౌన్‌

తొలిరోజు పకడ్బందీగా లాక్‌డౌన్‌
  • కర్ణాటక సరిహద్దులో రెండు చెక్‌పోస్టుల ఏర్పాటు, వాహనాలు తనిఖీ
  • 10 గంటల తర్వాత ఇండ్లకే పరిమితమైన జనం
  • ప్రధాన కూడళ్లలో పోలీసుల పహారా

జహీరాబాద్‌, మే 12: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిచడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. బుధవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు జహీరాబాద్‌ పట్టణంలోని దుకాణాలన్నీ జనంతో కళకళలాడాయి. ఆ తర్వాత వ్యాపార, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివావేశారు. పట్టణంలో లాక్‌డౌన్‌ విధించడంతో రోడ్లుపై ప్రజలు ఎవరూ రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జహీరాబాద్‌ డీఎస్పీ జి.శంకర్‌రాజు, పట్టణ సీఐ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు అమలు చేశారు. 65వ జాతీయ రహదారిపై కర్ణాటక సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద, జహీరాబాద్‌-బీదర్‌ రోడ్డుపై సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టి అనుమతి లేని వాహనాలను నిలిపివేశారు. డీఎస్పీ శంకర్‌రాజు సరిహద్దులో ఉన్న రెండు చెక్‌పోస్టులు తనిఖీ చేసి పోలీసులకు పలు సూచనలు చేశారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న రోడ్లుపై పెట్రోలింగ్‌ చేసేందుకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సరుకుల అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆ సమయంలో మద్యం అమ్మకాలు ప్రారంభించడంతో వినియోగదారులు భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. పలు చోట్ల మద్యం ప్రియులు క్యూలైన్లు కట్టి మద్యం కొనుగోలు చేయడం కనిపించింది.

‘ఖేడ్‌’ నిర్మానుష్యం
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించగా, తొలిరోజు బుధవారం ప్రజల నుంచి స్వచ్ఛంద సహకారం లభించింది. ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి రావడంతో ప్రజలు ఎవరికి వారు ఇండ్లల్లోనే ఉండి లాక్‌డౌన్‌ పాటించారు. నియోజకవర్గంలోని కంగ్టి, కల్హేర్‌, మనూరు, సిర్గాపూర్‌, నాగల్‌గిద్ద మండలాల్లో లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే నారాయణఖేడ్‌లోని రాజీవ్‌చౌక్‌, బసవేశ్వరచౌక్‌, శివాజీచౌక్‌లతో పాటు కూరగాయల మార్కెట్‌, రాంవిలాస్‌ మార్కెట్‌లోని దుకాణాలన్నీ మూసి ఉండడంతో ఆయా ప్రదేశాలన్నీ బోసిపోయి కనిపించాయి. పట్టణంలోని ప్రధాన రోడ్లు, వీధులు సైతం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఉదయాన్నే పలు రూట్లలో కొనసాగిన ఆర్టీసీ బస్సులు ఉదయం 10 గంటల వరకు స్థానిక ఆర్టీసీ డిపోకు చేరుకున్నాయి.

ఊరూవాడ బంద్‌
మండల కేంద్రమైన ఝరాసంగంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం ఉదయం 10 గంటల తర్వాత లాక్‌డౌన్‌ ప్రారంభంతో ఊరూవాడ బంద్‌ పాటించాయి. మండల కేంద్రంలోని వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా లాక్‌డౌన్‌ పాటిస్తుండడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

పోలీసుల పెట్రోలింగ్‌..
ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నుంచి తెలంగాణలో లాక్‌డౌన్‌ మొదలైన సందర్భంగా పుల్కల్‌ మండల పరిధిలోని సింగూర్‌, ముదిమాణిక్యం, పోచారం, ముద్దాయిపేట, పెద్దరెడ్డిపేట, మంతూర్‌, మిన్‌పూర్‌, కోడూర్‌, ఇసోజిపేట, గొంగ్లూర్‌, లక్ష్మీసాగర్‌, ఎస్‌ ఇటిక్యాల్‌తోపాటు తదితర గ్రామాల్లో ఉదయం 10గంటల తర్వాత దుకాణా సముదాయాలన్నీ మూతపడ్డాయి. పోలీసులు పలు గ్రామాల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ఒకే దగ్గర ఐదుగురు వ్యక్తులు కనిపించడంతో చెదరగొట్టారు.

లాక్‌డౌన్‌తో ఖాళీగా మారిన రోడ్లు
కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో బుధవారం నియోజకవర్గం వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులకోసం దుకాణాలకు సడలింపు ఇవ్వడంతో ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జోగిపేట బసవేశ్వర చౌక్‌, క్లాక్‌టవర్‌ రోడ్లు బోసిపోయాయి. వాహనాల రాకపోకలు, జన సంచారం లేకపోవడంతో జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. గ్రామాల్లోని ప్రధాన చౌరస్తాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ పక్కగా అమలు జరిగేలా చూస్తున్నామని జోగిపేట సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రజలు ఉదయం 10గంటల వరకు తమకు కావాల్సిన సరుకులు తీసుకుని ఇండ్లకు వెళ్లాలని ఆ తర్వాత రోడ్లపైకి రాకూడదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ సూచించారు. ఈ విషయంపై గ్రామాల్లోని సర్పంచ్‌లు చాటింపు వేయించి ప్రజలు స్వీయనియంత్రణ పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. భౌతికదూరం పాటించాలన్నారు.

రాయికోడ్‌ మండలంలో లాక్‌డౌన్‌
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ రాయికోడ్‌ మండలంలో సంపూర్ణంగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. రాయికోడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌ఐ ఏడుకొండలు మాట్లాడుతూ మండలంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సేకండ్‌ వేవ్‌ రూపంలో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో మండలంలోని అన్ని గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ మొగులయ్య తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తొలిరోజు పకడ్బందీగా లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement