మంగళవారం 02 మార్చి 2021
Sangareddy - Jan 17, 2021 , 00:11:53

తొలిరోజు 195

తొలిరోజు 195

కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం

సంగారెడ్డి జిల్లాలో 147 మందికి, మెదక్‌లో 48 మందికి వ్యాక్సినేషన్‌

టీకా తీసుకున్నవారిలో కనిపించని దుష్పరిణామాలు..

మొదటి డోసు తీసుకున్నవారికి 28 రోజుల్లో రెండో డోసు 

వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

కరోనా నిర్మూలనకు తొలిఅడుగు పడింది.. ప్రపంచాన్నే వణికించిన మహమ్మారిని మట్టుపెట్టేందుకు టీకా అందుబాటులోకి వచ్చింది. శనివారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఎంపిక చేసిన ఎనిమిది దవాఖానల్లో వ్యాక్సినేషన్‌ విజయవంతమైంది. తొలిరోజు వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరినీ వైద్యాధికారులు పరిశీలనలో ఉంచి ఎలాంటి దుష్పరిణామాలు కనిపించలేదని ధ్రువీకరించారు. కాగా, సంగారెడ్డి జిల్లాలో టీకాకు 180 మందిని ఎంపిక చేయగా, 147 మంది టీకాను తీసుకున్నట్లు డీఎంహెచ్‌వో మోజీరాంరాథోడ్‌ తెలిపారు. మెదక్‌ జిల్లాలో 60 మందికి 48 టీకా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డిలోని ఇందిరానగర్‌ యూపీహెచ్‌సీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, దిగ్వాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, జోగిపేటలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అలాగే, మెదక్‌ జిల్లా దవాఖానలో జడ్పీ చైర్‌పర్సన్‌ సుమలత శేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఏరియా ప్రభుత్వ దవాఖానలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. కరోనా టీకా కార్యక్రమం విజయవంతం కావడంతో అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 16 (నమస్తే తెలంగాణ)/ నెట్‌వర్క్‌

సంగారెడ్డి యూపీహెచ్‌సీలో ప్రారంభించిన ఎంపీ, కలెక్టర్‌ 

సంగారెడ్డి మున్సిపాలిటీ, జనవరి 16: వ్యాక్సినేషన్‌తో కరోనా నిర్మూనలకు పునాది పడిందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి ఇందిరా కాలనీలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో తొలి వ్యాక్సినేషన్‌ టీకాలను వేసే కార్యక్రమాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు కలెక్టర్‌ హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా టీకా  అందుబాటులోకి రావడం అందరూ సంతోషించాల్సి విషయమని కొనియాడారు. వ్యాక్సినేషన్‌తో కరోనా పూర్తిగా నిర్మూలన కావాలని, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని ఆకాక్షించారు.

జిల్లాలో 10,842 మందికి 

వ్యాక్సిన్‌ అందజేస్తాం : కలెక్టర్‌

 నాలుగైదు రోజుల్లో జిల్లాలో 10,842 మందికి కరోనా వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ముందుగా డాక్టర్లు, హెల్త్‌వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు వ్యాక్సిన్‌ అందించే ప్రక్రి య కొనసాగుతుందన్నారు. సమాజంలో కరోనా తరిమికొట్టడానికి సైనికుల్లా పోరాడుతున్న హెల్త్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ప్రారంభించామన్నారు. కొవిడ్‌-19 నిబంధనలను పాటించాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు 28 రోజుల్లో ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ ప్రారంభించామని, ఒక్కో కేంద్రంలో 30 మందికి చొప్పున 180 మందికి విజయవంతంగా వేయడం పూర్తయిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ శంకరి లత, మాజీ చింతా ప్రభాకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి, డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌, ఆర్డీవో మెంచు నగేశ్‌, ఆత్మకమిటీ చైర్మన్‌న శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కొవిడ్‌-19 నివారణకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ షురూ అయ్యింది. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ అంతం మొదలైంది. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో తొలిరోజు సుమారు 8 దవాఖానల్లో నిర్వహించిన కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ విజయవంతమైంది. తొలిరోజు వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి ఒక్కరినీ వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. 30 నిముషాలు పరిశీలించినా.. ఎలాంటి దుష్పరిణామాలు కనిపించలేదని వైద్యాధికారులు ధ్రువీకరించారు.   సంగారెడ్డి జిల్లాలో తొలిరోజు టీకాకు 180 మందిని ఎంపిక చేయగా, వీరిలో 147 మంది టీకాలను తీసుకున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రాథోడ్‌ తెలిపారు. మెదక్‌ జిల్లాలో రెం డు కేంద్రాల్లో సుమారు 60 మందికి వేయాలని నిర్ణయించగా, వీరిలో 48 కొవిడ్‌ టీకాలను తీసుకున్నారు. తొలుత రెండు జిల్లాల్లోనూ కేవలం వైద్య సిబ్బందికి మాత్రమే కొవిడ్‌ టీకాలను ఇచ్చామని మెదక్‌, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ యూపీహెచ్‌సీలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,  సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు కోవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగా, దిగ్వాల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, జోగిపేటలో  జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో మెదక్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌ జిల్లా దవాఖానలో ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కొరకు నిబంధనలకు లోబడి ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్య సిబ్బందిని సుమారు 30 నిముషాల పాటు ప్రత్యేక గదిలో అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఎలాంటి దుష్పరిణామాలు కనిపించని కారణంగా ఈ వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమని ధ్రువీకరించిన అధికారులు, నేటి నుంచి జరుగబోవు వ్యాక్సినేషన్‌లో ముందస్తుగా గుర్తించిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని కలెక్టర్లతో పాటు మెదక్‌, సంగారెడ్డి జిల్లాల వైద్యాధికారులు సూచించారు. మొదటి డోసు వ్యాక్సిన్‌ను తీసుకున్న వారికి సుమారు 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. రెండో డోసు ఎక్కడ, ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపనున్నట్లు వైద్యాధికారులు రాథోడ్‌, వెంకటేశ్వర్లు తెలిపారు. ఐదారు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలో సుమారు 10,842 మందికి, మెదక్‌ జిల్లాలో 4వేల పైచిలకు మంది వైద్య సిబ్బందికి టీకాను వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

బాగా పని చేస్తుందనే నమ్మకం ఉంది

కరోనా వ్యాక్సినేషన్‌ వేసుకోవడం ద్వారా కరోనా కట్టిడి అవుతుందనే నమ్మకం కలుగుతున్నది. ప్రభుత్వ చొరవతో మొదటగా తొలి టీకా వేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. మళ్లీ 28 రోజుల తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహించి వ్యాక్సిన్‌ పనితీరును చూస్తామని డాక్టర్లు చెప్పారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత బీపీని కూడా చెక్‌ చేసి నార్మల్‌ ఉందని డాక్టర్లు చెప్పారు.

-అనిత, స్టాఫ్‌ నర్సు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, సంగారెడ్డి

ఆదర్శంగా ఉండాలనే మొదటి టీకా తీసుకున్నా..

అందరికీ ఆదర్శంగా ఉండాలనే మొదటి టీకా నేను తీసుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నేను ముందు ఎలా ఉన్నానో టీకా తీసుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నా. ఎటువంటి దురద, మంట లేదు. ఎటువంటి భయం లేకుండా టీకాను తీసుకోవచ్చు.

- డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు, మెదక్‌

చాలా సంతోషంగా ఉంది..

కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకుని కరోనా నుంచి కాపాడుకోవాలి. ఇప్పటికైతే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌, నీరసంగా అనిపించలేదు.

- సుకన్య, స్టాఫ్‌ నర్సు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, సంగారెడ్డి

నర్సాపూర్‌ ఏరియా దవాఖానలో 25మందికి వ్యాక్సిన్‌

నర్సాపూర్‌ రూరల్‌, జనవరి 16: నర్సాపూర్‌ ఏరియా ప్రభుత్వ దవాఖానలో శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సాపూర్‌ ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్థోపెడిక్‌ వైద్యుడు గురుకృష్ణ మొదటి వ్యాక్సిన్‌ను తీసుకోగా, అనంతరం వైద్య సిబ్బంది గోవింద్‌, నవీన్‌, సాయికిరణ్‌, సబిత మిగతా 25 మంది వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని ప్రత్యేక గదిలో ఉంచి వైద్యులు పర్యవేక్షించారు. 

వైద్యుల కృషి మరువలేనిది : రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి

కరోనా సమయంలో వైద్యులు చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాదిలోగా వ్యాక్సిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కరోనా బారిన పడి చాలా మంది మృత్యువాత పడ్డారని, వారిలో వైద్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో గాంధీ దవాఖానలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో 30మంది వైద్య సిబ్బందికి కరోనా టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అనసూయఅశోక్‌గౌడ్‌, డీఆర్డీఏ శ్రీనివాస్‌, జడ్పీటీసీ బాబ్యానాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయనిర్మల, దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మీర్జా నజీమ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అశ్రిత్‌కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయీమొద్దీన్‌, వైద్యాధికారులు విజయ్‌కుమార్‌, వెంకట్‌యాదవ్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ శివకుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వైద్యసేవలు అభినందనీయం

టీకాను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్‌రావు

కోహీర్‌, జనవరి 16: కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడం అభినందనీయమని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పేర్కొన్నారు. శనివారం మండలంలోని దిగ్వాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిషీల్డ్‌ టీకా పంపిణీని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సోకితే సొంత ఇంటి వాళ్లు కూడా ముట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. కానీ వైద్య సిబ్బంది మాత్రం ఎలాంటి భయం లేకుండా తమ విధులను నిర్వహించారని ప్రశంసించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు టీకాను తయారు చేయడం దేశానికి గర్వకారణమని కొనియాడారు. దిగ్వాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 30 మందికి కరోనా టీకా వేశారు. తొలి టీకాను మండల వైద్యాధికారి డాక్టర్‌ రాజ్‌కుమార్‌ స్వీకరించారు. మండలంలో 186 మందికి గాను 30 మందికి టీకా వేశారు. టీకా వేయించుకున్న సిబ్బందిని 30 నిమిషాల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచారు. 28 రోజుల తర్వాత వారికి రెండోసారి టీకా వేయనున్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, డీపీవో సురేశ్‌మోహన్‌, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ గాయత్రీదేవి, సర్పంచ్‌ జ్యోతిరామలింగారెడ్డి, తాసిల్దార్‌ కిషన్‌, ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ రాందాస్‌, ఎంపీడీవో సుజాతనాయక్‌, ఎంపీవో వెంకట్‌రెడ్డి, నాయబ్‌ తాసిల్దార్‌ బస్వరాజ్‌, ఎంపీటీసీ బక్కారెడ్డి, సొసైటీ చైర్మన్‌ రియాజుద్దీన్‌, ఉప సర్పంచ్‌ రియాజ్‌, ఆనంద్‌, శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి, శ్రీశైలం, నర్సింహులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కరోనా టీకా ప్రజలకు వరం

ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, జనవరి 16 : కరోనా వ్యాక్సినేషన్‌ ప్రజలకు వరమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరులోని ఏరియా దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ ఆన్‌లైన్‌ ప్రత్యక్ష ప్రసారంలో సందేశాన్ని వీక్షించారు. 17 మందికి తొలిరోజు వాక్సినేషన్‌ వేశారు. దవాఖానలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహించే కొండల్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ మనోహర్‌రాజు తొలి వాక్సిన్‌  వేయించుకున్నారు. ఈ సందర్భంగా వారిని  ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ... వాక్సిన్‌ పంపిణీ దేశం గర్వించే స్థాయి కార్యక్రమన్నారు. ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ అందరిలో భరోసా నింపుతున్నారన్నారు. వాక్సిన్‌ మొదట సోకే ప్రమాదం ఉన్న అధికారులు, వైద్య సిబ్బందికి వేస్తున్నారన్నారు. త్వరలోనే ప్రజలందరికీ వేస్తామని చెప్పారు.  

17 మందికి వాక్సినేషన్‌..

తొలి రోజు 17 మందికి వాక్సినేషన్‌ వేసినట్లు పటాన్‌చెరు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వసుంధర తెలిపారు. తొలిరోజు 30 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. 17 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి వాక్సిన్‌ వేశామన్నారు. 150 మంది సిబ్బందికి వాక్సిన్‌ వేయాలనే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. వారిలో తొలి విడత 30 మందికి వేసామన్నారు. రెండో డోస్‌ 28 రోజుల్లో వేస్తామని వివరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్‌, సుప్రజ, ఎంపీపీలు సుష్మశ్రీ, ప్రవీణ, మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధు, అంజయ్యయాదవ్‌, పుష్ప, మెట్టు కుమార్‌యాదవ్‌, తాసిల్దార్‌ మహిపాల్‌రెడ్డి, డీఎస్పీ భీంరెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్‌, దశరథరెడ్డి,  వెంకట్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, నగేశ్‌ పాల్గొన్నారు.

టీకా అద్భుతం..

మెదక్‌ కలెక్టరేట్‌, జనవరి 16 : ప్రపంచాన్ని వణికించిన కరోనాన్ని నియంత్రించేందుకు కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించుకోవడం అద్భుతమని మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా ప్రధాన దవాఖానలో కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలత మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యులు ముందుండి ప్రాణాలను పణ్ణంగా పెట్టి సైనికులుగా పోరాడారని వారి సేవలు మరువలేనివని పేర్కొన్నారు.    

మహమ్మారి  నియంత్రణకు టీకాయే  మార్గం :

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

కరోనా మహమ్మారిని నియంత్రణకు టీకాయే మార్గమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శాస్త్రవేత్తలు ఏడాదిలోగా వాక్సిన్‌ కనుగొన్నారని అన్నారు. మెదక్‌, నర్సాపూర్‌లో కొవిషీల్డ్‌ టీకాను ఇస్తున్నామన్నారు.  అనంతరం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 50 సంవత్సరాలు పై బడిన, 50 సంవత్సరాలలోపు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు లక్ష 50 వేల మంది వరకు ఉంటారని, వారికి మూడో దశలో టీకాలు వేస్తామన్నారు. అనంతరం కొవిషీల్డ్‌ వాక్సిన్‌ బాక్స్‌ను తెరిచి ముందుగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావుకు టీకా వేశారు. అనంతరం  30 మంది డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేసి పరిశీలనలో ఉంచారు.  కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, డీఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, డీపీవో తరుణ్‌ పాల్గొన్నారు.

వైద్య సిబ్బంది సేవలు ఆమోఘం

అందోల్‌, జనవరి 16 : కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవచేశారని, వారి సేవలు ఎంతో ఆమోఘమని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు.  జోగిపేట ప్రభుత్వ దవఖానాలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీవో విక్టర్‌, దవాఖాన సూపరిండెంటెండ్‌ శంకర్‌బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్‌ మల్లికార్జున్‌గుప్తా, మాజీ చైర్మన్‌ నాగభూషణం, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశం మున్సిపల్‌ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌ 

జోగిపేట ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ హనుమంతరావు పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో మొదటి విడతలో ఎంపికైన 10, 341 సిబ్బందికి నాలుగు రోజులపాటు ఆరు సెంటర్లలో వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. మొదటి రోజు ఒక్కో సెంటర్‌లో  30 మంది చొప్పున 180 మందికి వేశామన్నారు. 

భయంతోనే టీకా తీసుకున్నా

ఆరోగ్యంగా ఉన్నాను. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం ముందు పేరును నమోదు చేసుకున్న. టీకా వేసేటప్పుడు చాలా భయం వేసింది. ప్రతిఒక్కరినీ 30 నిమిషాలు వారి అబ్జర్వేషన్‌లో ఉంచారు. మొత్తానికి టీకా వేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

-విజయలక్ష్మి, కోహీర్‌ ఏఎన్‌ఎం

ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌  

జహీరాబాద్‌ ఏరియా ప్రభుత్వ దవాఖానలోవ్యాక్సినేషన్‌ కేంద్రం ప్రారంభం

పాల్గొన్న ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

జహీరాబాద్‌, జనవరి 16 : ప్రతిఒక్కరికీ కరోనా టీకా వేయనున్నట్లు జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. శనివారం జహీరాబాద్‌ ఏరియా దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ సురక్షితం కాదంటూ వచ్చిన వదంతులను ప్రజలు నమ్మొదన్నారు. కరోనా టీకా మొదట వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు వేశామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, ఆర్డీవో రమేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సుభాశ్‌రావు, వైద్యులు బాల్‌రాజు, సునిల్‌కుమార్‌, జనార్దన్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

జహీరాబాద్‌లో వ్యాక్సినేషన్‌ విజయవంతం..

జహీరాబాద్‌ ఏరియా దవాఖానలో ఉదయం 9 గంటలకు వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రారంభించారు.  వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు 30 మందికి వ్యాక్సినేషన్‌ వేశారు. టీకా తీసుకున్న వారిని వైద్యులు ఆర గంట పాటు పరిశీలనలో ఉంచారు. కరోనా టీ కార్యక్రమం విజయవంతం కావడంతో అధికారులు, వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. 

VIDEOS

logo