సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Oct 18, 2020 , 01:27:43

బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు

బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు

అమ్మవారిని దర్శించుకున్న భక్తులు  

గుమ్మడిదల : బాలాత్రిపుర సుందరీదేవిగా భద్రకాళీ మాత భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం మండలంలోని బొంతపల్లి-వీరన్నగూడెంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్‌ గటాటి భద్రప్ప, ఈవో శశిధర్‌గుప్తా ఆధ్వర్యంలో శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారిని మొదటి రోజు బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కానుకుంటలో సప్తమాత్రిక సమేత మహంకాళీ ఆలయం, గుమ్మడిదలలో దుర్గామాత ఆలయం, అన్నారం గ్రామంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.  

అందోల్‌లో..

అందోల్‌ : దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామా ల్లో ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందోల్‌-జోగిపేట మున్సిపాలిటీతోపాటు ఆయా మండలాల్లో స్థానిక యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. 

జిన్నారం/బొల్లారంలో

జిన్నారం/బొల్లారం : మండల వ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రం జిన్నారం మండలంతోపాటు బొల్లారం మున్సిపాలిటీలో అమ్మవారి విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తొలి రోజు భక్తులు భారీగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

రాయికోడ్‌లో..

రాయికోడ్‌ : విజయదశమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బాలాత్రిపుర సుందరీదేవిగా శ్రీముమ్మాదేవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. మండల కేంద్రమైన రాయికోడ్‌లోని శ్రీ ముమ్మాదేవి ఆలయంలో కొలువైన అమ్మవారు ప్రతిరోజు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.  

హత్నూరలో..

హత్నూర : మండల పరిధిలోని శేర్కాన్‌పల్లి శివారులోని పలుగు పోచమ్మ అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 

రామచంద్రాపురంలో..

రామచంద్రాపురం : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్సీపురం డివిజన్‌లోని మల్లికార్జుననగర్‌, విద్యుత్‌నగర్‌ల్లో దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భెల్‌లోని కనకదుర్గాదేవి ఆలయం, పెద్దమ్మతల్లి ఆలయాల్లో అమ్మవారు స్వర్ణకవచాలంకృతదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.   


logo