బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Sep 21, 2020 , 00:02:42

మాతాశిశు సంరక్షణే లక్ష్యం

మాతాశిశు సంరక్షణే లక్ష్యం

సంగారెడ్డి: గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. పోషకాహారాన్ని ఇండ్ల వద్దకే అందజేస్తున్నాయి. పోషక లోపాలు ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా, సమయానుకూలంగా పోషకాహారాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణలో వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి వారి సంరక్షణ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి.  3 నుంచి 6 ఏండ్లలోపు చిన్నారులకు టీ-శాట్‌తో విద్యా బోధన అందిస్తున్నారు. అంగన్‌వాడీల్లో పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు సెప్టెంబర్‌ నెలలో మాసోత్సవాలను నిర్వహించనున్నాయి. మాసోత్సవాల్లో మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

 ఆహారంతోనే జీవన విధానం..

సంపూర్ణ ఆరోగ్యానికి తగిన మోతాదులో భోజనం తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ వ్యక్తులకు ఆహారం విషయంలో తక్కువ, ఎక్కువలు పర్వాలేదు. కానీ, గర్భిణులు, బాలింతలు, ఐదేండ్ల లోపు చిన్నారుల్లో పోషకాహారం లోపిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీరి పోషణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజులపాటు సెప్టెంబర్‌ను పోషక మాసోత్సవంగా ప్రకటించాయి. నెలరోజులు జిల్లాలో పోషణ అభియాన్‌ కార్యక్రమాన్ని సంబంధితశాఖ అధికారులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక ఆరోగ్యంతో కలిగే లాభాలు, పోషకాహారం తీసుకోకుంటే కలిగే అనర్ధాల గురించి వివరిస్తారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో అంగన్‌వాడీ కేంద్రాలు మూసి ఉన్నాయి. దీని కారణంగా ఇండ్ల వద్దే ఉన్నా, ఇలాంటి వారికి వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి సమాచారాన్ని చేరవేస్తున్నారు. దీంతో ప్రతిరోజు పోషకాహారం రకాలు, లాభాలు తదితరల అంశాలపై వాట్సాప్‌ గ్రూపులకు అధికారులు పంపిస్తున్నారు.

పోషకాహారంతో లాభాలు అధికం...

పోషకాహారం తీసుకున్న గర్భిణులు, బాలింతలకు పుట్టే బిడ్డ మంచి బరువుతో ఉంటారని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మానసిక ఎదుగుదల అధికంగా ఉండటంతో పాటు పుట్టుకతో వచ్చే కొన్ని అవలక్షణాలు తగ్గే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. రక్తహీనత, శక్తి, మాంసకృతుల లోపం, అయోడిన్‌, విటమిన్‌ ఏ, బీ లోపాలకు గురికాకుండా ఉంటారు. బరువు తక్కువగా ఉండటం, బలహీనంగా ఉండటం వంటి సమస్యల నుంచి బయటపడుతారు. శ్వాస తీసుకోవడం, గుండె కదలికలు, బీపీ క్రమబద్ధంగా ఉంటుంది. బుద్ధి మాంధ్యం మీత జననాలు, పిల్లల మరణాలు, పురిటి మరణాలను నివారించే అవకాశం పోషకాహారం తీసుకున్న మహిళలకు ఉంటుంది. ఆహార సంబంధిత దీర్గకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి. ముఖ్యంగా పిల్లల్లో గ్రహించే శక్తి ఏకాగ్రత, తెలివితేటలు పెరగడంతోపాటు ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. శరీరంలో కొత్త కణాలు ఏర్పడి శక్తిని పెంచే అవకాశం పుష్కలంగా ఉంటుంది. చెడిపోయిన కణజాలానికి మరమ్మతు చేసేందుకు ఉపయోగపడుతుంది.

చిన్నారులకు అందించే ఆహారం...

చిన్న వయస్సులోనే బిడ్డ ఎదుగుదల ఎక్కువగా ఉండి, చురుగ్గా తయారవ్వడంతో అధిక పోషకాలు అవసరమవుతాయి. తల్లిపాలలో ఉన్న పోషకాలు బిడ్డ ఏడో నెల తర్వాత ఉంచినా సరిపోవు. ఈ సమయంలో ఆ పిల్లలకు పోషకాహారం తప్పని సరి అవుతోంది. శిశువుకు ఇచ్చే ఆహారం సులభంగా మింగేలా ఉండాలి. ఇంట్లో లభించే బియ్యం, గోధు మ, జొన్న, సజ్జలతోపాటు పెసర, శనగ, పుట్నాలు, వేరుశనగ, నువ్వులు, చక్కెర, బెల్లం తదితర పదార్థాలతో పోషకాహారం సులువుగా తయారు చేసుకోవచ్చు. ఆహార తయారీపై వాట్సాప్‌ గ్రూపులతో మహిళలు, గర్భిణులకు అంగన్‌వాడీ కార్యకర్తలు అవగాహన కల్పిస్తారు. స్నాక్స్‌గా బిస్కెట్లు, బ్రెడ్‌, అరటిపండ్లు, ఉడిగించిన ఆలుగడ్డలు కూడా తినిపించాలి. వేరుశనగ, ఎండుకొబ్బరి, బాదంలో ఎక్కువగా శక్తి ఇచ్చే పోషకాలు అధికంగా ఉంటాయి. బిడ్డకు ఇచ్చే ప్రతి భోజనంలో చెంచా నెయ్యి, నూనె ఉండేలా చూసుకోవడం మంచిది.

మహిళా, శిశుసంక్షేమ శాఖతో...

సెప్టెంబర్‌ నెలంతా పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తారు. దీంతోపాటు  మహిళా, శిశుసంక్షేమ శాఖతో గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఇంటికే గుడ్లు, పాలు, బియ్యం, కందిపప్పు, మంచి నూనె అందజేస్తున్నారు. కరోనా ప్రభావంతో టేక్‌ హోం రేషన్‌తో ఇండ్ల వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారు. తీవ్ర, అతితీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించేందుకు మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు ప్రత్యేకంగా సర్వే చేపడతారని అధికారుల సమాచారం. ఇందులో గుర్తించిన పిల్లలకు ఇండ్ల వద్దే పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి పిల్లలను ఇంతకుముందు న్యూట్రీషన్‌ రిహాబిలేషన్‌ కేంద్రాలకు పంపించేవారు. ఇలా గుర్తించిన పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలతో ఇండ్ల వద్దే పోషకాహారం అందించేలా కార్యకర్తలకు సూచించారు. పిల్లల బరువులు తూచే ఐదు రకాల మిషన్లు కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దీంతో పిల్లల ఎత్తు, బరువులను గుర్తించి పోషకాహారంపై సూచనలు ఇస్తారు.  

మాసోత్సవంలో చేపట్టనున్న పనులు..

సెప్టెంబర్‌ నెలను మాసోత్సవంగా ప్రభుత్వాలు ప్రకటించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపం ఉన్న చిన్నారులను మొదటి 15 రోజులపాటు గుర్తిస్తారు. కరోనా నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా అంగన్‌వాడీ సిబ్బంది మాస్క్‌, శానిటైజర్లు, భౌతిక దూరాలు పాటించే కార్యక్రమాలు చేపడతారు. వయస్సుకు తగిన బరువు, ఎత్తు లేకపోవడం, చురుకుదనం లేకపోవడం వంటి కార్యక్రమాలను రోజుకు 5 మంది చిన్నారులకు మాత్రమే చేపట్టి నివేదికలు నమోదు చేస్తారు. ఈ నెల 30వ తేదీ వరకు తోటల పెంపకాన్ని చేపట్టనున్నారు. అంగన్‌వాడీ పరిసర ప్రాంతాల్లో సరిపడా స్థలం ఉన్నవారు ఆ ప్రదేశంలో స్థలం లేనివారు, వృథాగా పడి ఉన్న ప్లాస్టిక్‌ టబ్‌లు, బకెట్లు, ప్లాస్టిక్‌ బకెట్లలో మొక్కల పెంపకం చేపట్టనున్నారు. సేంద్రియ పద్ధతిలో  కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇతర ఆకుకూరలను పండిస్తారు. ఇంటికే పోషక ఆహార పదార్థాలను పంపిణీ చేపట్టి వాట్సాప్‌ కాల్‌తో చిన్నారులకు డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తారు.

జిల్లాలో 1504 అంగన్‌వాడీలు...

జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రతిరోజు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీలు సరఫరా చేస్తున్నారు. కరోనాతో ఇబ్బందులు ఎదురుకాకుండా వారివారి ఇండ్ల వద్దకే వెళ్లిసరుకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మెయిన్‌ అంగన్‌వాడీలు 1344, మినీ అంగన్‌వాడీలు 160 ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో 1472 మంది టీచర్లు విధులు నిర్వహిస్తు సేవలందిస్తున్నారు.  బాలింతలు 11,548 మంది, గర్భిణులు 12,419 మంది ఉన్నారు. 6 నెలల లోపు 11,076 పిల్లలు, మూడేండ్ల లోపు చిన్నారులు 47,782 మంది, ఆరేండ్ల లోపు చిన్నారులు 26,233 మంది ఉన్నారు. జిల్లాలో ఐదు ప్రాజెక్టులతో అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. 

గర్భిణులకు పోషకాహారంతో ఆరోగ్యం 

గర్భిణులు ప్రసవమయ్యే వరకు పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న బాలమృతంతో తీసుకుని సంపూర్ణ ఆరోగ్యాంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు ఇంటి వద్దనే ఉంటూ పౌష్టికాహారాన్ని తీసుకుంటూ విశ్రాంతిలో ఉండాలి. ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు అందిస్తున్న గుడ్లు, పాలు, బియ్యం, పప్పు, నూనెలను క్రమం తప్పకుండా వాడుకోవాలి. కరోనా కాలంలో గర్భిణులు జాగ్రత్తలు పాటిస్తూ వైరస్‌ బారినా పడకుండా ముందస్తుగా వైద్యుల సలహాలు, సూచనల మేరకు ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. - పద్మావతి, జిల్లా సంక్షేమాధికారి సంగారెడ్డి


logo