గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Feb 25, 2020 , 03:13:41

ఏటీఎం, నగదు భద్రం

ఏటీఎం, నగదు భద్రం
  • దొంగిలించిన మిషన్‌ ఆచూకీ లభ్యం
  • ధ్వంసం చేసేందుకు విఫలప్రయత్నం చేసిన దొంగలు
  • ఏటీఎంతో పాటు ఆటోట్రాలీ వదిలేసిన దుండగులు
  • కంది మండలం చెర్యాల గ్రామ శివారులో లభ్యమైన మిషన్‌, వాహనం

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : రుద్రారం ఇండిక్యాష్‌ ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలకు చేదు అనుభవం మిగిలింది. రూ.2.27లక్షల నగదు లోపల ఉన్నా వారు ఏటీఎంను తెరవలేకపోయారు. ఏటీఎం మెషిన్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయినా అది పగలకపోవడంతో ఆటో ట్రాలీని సైతం చెర్యాలలో వదిలి దొంగలు పారిపోయారు. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని ఇండిక్యాష్‌ ఏటీఎం కేంద్రంలో శనివారం అర్ధరాత్రి దొంగలు ఏటీఎం మెషిన్‌ను ఎత్తుకెళ్లిన ఘటనలో ఏటీఎంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్యాల శివారులో పొదల మాటున ఏటీఎం పోలీసులకు లభించింది. దొంగలు ఎత్తుకెళ్లిన ఏటీఎంను తెరిచేందుకు దుండగులు ఎంతో ప్రయత్నం చేశారు. ఎంతో కష్టపడి ఏటీఎంను ఆటోట్రాలీలో వేసుకుని ఉడాయించిన దొంగలకు నగదు మాత్రం చేతికందలేదు. అర్ధరాత్రి సమయంలో దొంగతనం చేసిన దొంగలు సురక్షితమైన ప్రాంతాన్ని తీసుకెళ్లి ఏటీఎంను తెరిచేందుకు చేసిన ప్రయత్నాలతో తెల్లవారి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంను తెరవలేక వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు దొంగతనం కోసం వాడిన మినీ గూడ్స్‌ క్యారియర్‌ వాహనం అక్కడే వదిలేశారు. ఎంత కష్టపడ్డా వారి చేతిక నగదు దొరకపోవడంతో బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రుద్రారం నుంచి 10 కిలో మీటర్లలోపు ఏటీఎం మెషిన్‌ను వదిలేశారు. ఆ లోపు  ఉన్న పలు హోటళ్లలో దొంగల ఆనవాళ్లను పోలీసులు వెతుకుతున్నారు. జిల్లా పోలీసులు రుద్రారంలో జరుగుతున్న వరుస నేరాలపై ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఈ కేసులో పురోగతి కోసం క్లూస్‌ టీమ్స్‌తో కలిసి దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 


logo