శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Jan 30, 2020 , 23:46:56

నేనున్నాను..

నేనున్నాను..
  • అభివృద్ధిలో భాగస్వాములుకండి
  • ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి
  • ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయండి
  • అందోలు మున్సిపాలిటీ నూతన పాలకవర్గంతో మంత్రి కేటీఆర్‌
  • ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు ప్రత్యేక అభినందనలు


అందోల్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన అందోలు-జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. గురువారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పాలకవర్గం సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కౌన్సిలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ అందోలు-జోగిపేట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని  పాలకవర్గ సభ్యులకు సూచించారు. ప్రజలకు సేవలు అందించడంలో, సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందించాలన్నారు. తప్పుడు పనుల జోలికి వెళ్లకూడదని ఆయన హితవు పలికారు. అందోలు నియోజకవర్గ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు సహకరించి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు.


అందోలు-జోగిపేట మున్సిపాలిటీని మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని, ఇందుకు కావాల్సిన నిధులను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంజూరు చేస్తానని ఆయన హామీనిచ్చారు. కాంగ్రెస్‌ కంచుకోట అందోలు-జోగిపేట మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంపై ఆయన ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎమ్మెల్యేకు సూచించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, కౌన్సిలర్లు భారతి, చందర్‌, దుర్గేశ్‌, భాగ్యలక్ష్మి, మాధవి, ధనలక్ష్మి, ఆర్‌.భవానీ, లక్ష్మీబాయి, సుమిత్ర, డిక్కీ సౌత్‌ ఇండియా వైస్‌ చైర్మన్‌ రాహుల్‌ కిరణ్‌, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, మాజీ ఎంపీపీ రామాగౌడ్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ డీబీ.నాగభూషణం, పట్టణ టీఆర్‌ఎస్‌ చాపల వెంకటేశం, మాజీ కౌన్సిలర్‌ పిట్ల లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు. 


logo