Tribanadhari Barbaric | ప్రస్తుత కాలంలో మైథలాజికల్ టచ్ ఉన్న చిత్రాలు ఏ రేంజ్లో క్లిక్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. బార్బరికుడి శక్తిని ఆధారంగా తీసుకుని స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో, విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 29న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు (సత్య రాజ్) తన మనవరాలు నిధి (మేఘన) మిస్సింగ్ కేసు గురించి పోలీసులను ఆశ్రయిస్తాడు. అదే సమయంలో, విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న రామ్ (వశిష్ట ఎన్ సింహా)కు ₹30 లక్షలు అవసరం అవుతాయి. ఈ క్రమంలోనే అతనికి సత్య (సాంచీ రాయ్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. మరోవైపు జూదానికి బానిసైన లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) అల్లుడు దేవ్ దాసన్న (మొట్ట రాజేంద్రన్) వద్ద ₹15 లక్షల అప్పు చేసి, దాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడతాడు. ఇక దేవ్, రామ్లు మంచి స్నేహితులు. ఈ ఇద్దరూ తమకు అవసరమైన డబ్బుని ఎలా సంపాదించుకుంటారు? దాని కోసం ఏం చేస్తారు? నిధికి ఏమైంది? తన మనవరాలి కోసం తాత శ్యామ్ ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ.
‘త్రిబాణధారి బార్బరిక్’ కథాంశం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల మాదిరిగానే ఉంటుంది. మత్తు పదార్థాలకు బానిసై మృగాళ్లలా ప్రవర్తిస్తున్నవారిని, వారివల్ల జరిగే నేరాలను ఎలా అరికట్టాలనే విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు.
సినిమా మొదటి సన్నివేశం నుంచే థ్రిల్లింగ్గా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. నిధి కిడ్నాప్ మిస్టరీ, రామ్ డబ్బు వేట, దేవ్ అప్పు సమస్య… ఇలా అనేక అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కథకు మరింత బలాన్నిస్తుంది.
ద్వితీయార్థంలో కథ వేగంగా ముందుకు సాగుతుంది. మిస్సింగ్ కేసు కాస్తా హత్య కేసుగా మారడం, ఆ తర్వాత తాత తన మనవరాలి మరణానికి ఎలా న్యాయం చేస్తాడు అనే అంశాలు ఆసక్తికరంగా చిత్రీకరించారు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. సినిమా ముగింపు ఎమోషనల్గా, ఒక మంచి సందేశంతో ఉంటుంది.
సత్య రాజ్.. సైకాలజిస్ట్ పాత్రలో సత్య రాజ్ తన అనుభవాన్ని చూపిస్తూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా మాటలు లేకుండానే ఆయన భావాలను పలికించిన తీరు మెచ్చుకోదగినది. వశిష్ట ఎన్ సింహా రామ్ పాత్రలో వశిష్ట విభిన్నమైన నటనను ప్రదర్శించి మెప్పించారు. క్రాంతి కిరణ్.. కొత్త కుర్రాడైనప్పటికీ, క్రాంతి కిరణ్ తన పాత్రలో ఒదిగిపోయి మంచి నటనను చూపించాడు. ఉదయభానుకి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర లభించిందని చెప్పవచ్చు. సత్యం రాజేష్, సాంచీ రాయ్, మేఘనతో పాటు, హాస్యం కోసం తీసుకున్న వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్రన్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికపరంగా, ఈ సినిమా ఉన్నత ప్రమాణాలను పాటించింది. కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచాయి. తొలి ప్రాజెక్ట్ అయినప్పటికీ, వానరా సెల్యూలాయిడ్ నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఎడిటింగ్, ఆర్ట్, క్యాస్టూమ్ డిపార్టెంట్స్ తమ వంతుగా సినిమాను నిలబెట్టాయి. మాటలు కొన్ని చోట్ల మనసుని తాకేలా ఉంటాయి.SW