Kingdom Review | విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమా కోసం ఆయన అభిమానులే కాదు పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ కాన్వాస్‌లో ఈ సినిమాని నిర్మించింది. జెర్సీతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకుడు కావడం, విజయ్ ఎన్నడూ లేని రగ్గడ్ లుక్‌లో కనిపించడం, ఖచ్చితంగా సినిమాని థియేటర్స్‌లో చూడాలనిపించే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను ‘కింగ్డమ్’ అందుకుందా? విజయ్ ఖాతాలో మరో విజయం పడిందా? రివ్యూలో చూద్దాం.
కథ:
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. సూరి అన్న శివ (సత్యదేవ్). అనుకోని కారణాల వల్ల శివ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోతాడు. తన అన్న కోసం సూరి వెదుకుతూనే ఉంటాడు. ఓ సందర్భంలో సూరి తన పై అధికారిపై చేయి చేసుకుంటాడు. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు సూరికి ఓ మిషన్ అప్పగిస్తారు అధికారులు. అండర్ కవర్ ఏజెంట్‌గా మారి శ్రీలంకలో వున్న ఓ గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకోవాలి. ఇదీ ఆ మిషన్. ఇలా చేస్తే సూరికి తన అన్నని కలిసే అవకాశం దొరుకుతుంది. ఈ మిషన్కి ఒప్పుకున్న సూరి శ్రీలంక పయనం అవుతాడు. తర్వాత ఏం జరిగింది? అసలు శివ లంకకి ఎందుకు వెళ్లాడు? అక్కడ ఎలాంటి పనులు చేస్తున్నాడు? అన్న కోసం వెళ్లిన సూరికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఇదంతా మిగతా కథ.
కథా విశ్లేషణ:
ఒక సైనికుడు తన ప్రజలను రక్షించడానికి రాజుగా మారిన కథ ఇది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ కథను రొటీన్‌గా కాకుండా బలమైన ఎమోషన్ డ్రామాకు పెద్దపీట వేస్తూ నడిపిన విధానం ఆసక్తికరంగా ఉంది. డెబ్బై ఏళ్ల క్రితం శ్రీకాకుళం తీర ప్రాంతంలో తన తెగ ప్రజలను రక్షించడానికి బ్రిటిష్ వారితో యుద్ధం చేసిన ఓ నాయకుడి పాత్రను పరిచయం చేస్తూ ‘కింగ్డమ్’ కథను మొదలుపెట్టిన తీరు ప్రేక్షకుడిని ఆరంభంలోనే కథలో లీనమవ్వేలా చేసింది. ఆ తర్వాత సూరి తన అన్న కోసం పడే తాపత్రయంలో ఎమోషన్ బాగా కుదిరింది. కథ శ్రీలంకకి షిఫ్ట్ అయిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారుతుంది. జైల్లో జరిగే ఫైట్, సూరి శివని కలిసే సన్నివేశాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది.
ఈ కథకు బలమైన ఇంటర్వెల్ బ్యాంగ్ దొరికింది. గోల్డ్ స్మగ్లింగ్ ఎపిసోడ్, ఆ తర్వాత నావీ అధికారుల నుంచి గోల్డ్ దొంగతనం, సీక్రెట్ కోడ్ రివీల్ చేయడం… ఈ సీక్వెన్స్‌లు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచడమే కాదు ద్వితీయార్థంపై ఉత్కంఠను పెంచుతాయి. ఫస్ట్ హాఫ్‌ని బలమైన ఎమోషనల్ డ్రామాగా నడిపిన దర్శకుడు సెకండ్ హాఫ్ మరింత పట్టుతో నడిపే ప్రయత్నం చేశాడు. అన్నదమ్ముల మధ్య వుండే ఒక సీక్రెట్ ఫ్లాష్‌బ్యాక్‌ని రివీల్ చేసిన విధానం బావుంది. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు బలమైన క్లైమాక్స్‌కి పునాది వేశాయి. రక్షకుడైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న ఓ తెగ ప్రజలు తమ రాజు ఎన్నుకోవడం, అంతకుముందు జరిగిన మారణహోమం సెకండ్ పార్ట్‌పై మరిన్ని అంచనాలను పెంచాయి.
నటీనటులు గురించి:
విజయ్ దేవరకొండ సూరి పాత్రను పోషించిన తీరు అద్భుతం. తనకు ఎంత బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. శ్రీలంక వెళ్లిన తర్వాత తన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్బిలీవబుల్గా ఉంది. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టాడు. దాదాపు సినిమాను తన భుజాలపై మోసుకొచ్చాడు. సత్యదేవ్ ఈ కథకు ప్లస్ అయ్యాడు. తన కళ్లలో చక్కని ఎమోషన్స్ పలికించాడు. జైల్లో తొలిసారి కలుసుకున్న సన్నివేశంలో ఇద్దరి నటన నెక్స్ట్ లెవల్లో ఉంది. భాగ్యశ్రీ పాత్ర కీలకమైనదే కానీ ఆమె పాత్ర ప్రాధాన్యతను సెకండ్ పార్ట్ కోసం అన్నట్టుగా దాచారు. అందుకే ఆ పాత్ర అంతగా కనెక్ట్ కాదు. మలయాళ నటుడు వెంకటేష్ సైకో విలనిజం చూపించాడు. అయ్యప్ప శర్మతో పాటు మిగతా పాత్రలు పరిధి మేర ఉన్నాయి.
టెక్నికల్‌గా:
సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. శ్రీలంక బ్యాక్‌డ్రాప్, అన్నీ రియల్ లొకేషన్లు తీసిన సీన్స్ నేచురల్ ఫీలింగ్ కలిగిస్తాయి. అనిరుధ్ నేపథ్య సంగీతం కథను ఎలివేట్ చేసింది. పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్రొడక్షన్ డిజైన్ టాప్ లెవల్లో ఉంది. దర్శకుడు సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దాడు. వరల్డ్ బిల్డింగ్ చాలా బావుంది. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. రొటీన్‌గా కాకుండా ఒక బలమైన యాక్షన్ డ్రామా చూడాలనుకునే ప్రేక్షకులు ‘కింగ్డమ్’ను చక్కగా ఆస్వాదిస్తారు.
ప్లస్ పాయింట్స్:
-విజయ్ దేవరకొండ
-అన్నదమ్ముల ఎమోషన్
-బలమైన యాక్షన్ డ్రామా
-ఉన్నత నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
-ఎలివేషన్స్ తగ్గడం
-సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
-బలహీనమైన హీరోయిన్
రేటింగ్: 3.25/5