సినిమా పేరు: వార్ 2
తారాగణం: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా, అలియాభట్, బాబీ దేవోల్, శర్వారీ వాఘ్ తదితరులు
దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
సంగీతం: ప్రీతం చక్రవర్తీ, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా..
నిర్మాత: ఆదిత్య చోప్రా
నిర్మాణం: యష్‌రాజ్ ఫిలిమ్స్
విడుదల తేదీ : ఆగష్టు 14
కెమెరా: బెంజమిన్ జాస్పర్
ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్లో నటించిన సినిమా ‘వార్ 2’. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్. దాంతో బాలీవుడ్ దర్శకుల దృష్టి తారక్‌పై పడింది. అందులో భాగంగా వచ్చిన అవకాశమే ఈ ‘వార్ 2’. పైగా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ నటించిన భారీ మల్టీస్టారర్ ఈ సినిమా. ఇందులో ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి నటించారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనియర్స్లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో వచ్చిన అదే సంస్థ నుంచి వచ్చిన మరో పానిండియా ప్రయత్నం ఈ ‘వార్2’. నిర్మాణంలో ఉన్నప్పుడే ఈ సినిమాపై ఎన్నో అంచనాలేర్పాయి. ఎట్టకేలకు గురువారం ఈ సినిమా విడుదలైంది. మరి అందరి అంచనాలనూ ‘వార్ 2’ నిజం చేసిందా? యష్‌రాజ్ స్పై యూనియర్స్లో మరో విజయం చేరినట్టేనా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
కథ
ఇండియన్ రా ఏజెన్సీలో ప్రముఖుడైన ఏజెంట్ కబీర్(హృతిక్) కిరాయి హంతకుడిగా మారి హత్యలు చేస్తుంటాడు. ఇదిలావుంటే.. చైనా, రష్యా, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలన్నీ ఒక కోటరీగా మారి, ‘కలి’ పేరుతో ఇండియా పతానానికి ప్లాన్ చేస్తాయి. ఈ మిషిన్‌ని కబీర్‌కు అప్పజెబుతాయి. కబీర్‌ను అడ్డుకునేందుకు విక్రమ్ చలపతి(జూనియర్ ఎన్టీఆర్) రంగంలోకి దిగుతాడు. అసలు కబీర్కీ, విక్రమ్‌కు మధ్య ఉన్న బంధం ఏంటి? ‘కలి’ వల్ల భారత ప్రధానికి పొంచివున్న ముప్పును వీరిద్దరూ ఎలా ఆపారు? ఈ మిషన్‌లో వింగ్ కమాండర్ కావ్య లూత్ర(కియారా అద్వానీ) పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
గతంలో వచ్చిన యష్‌రాజ్ స్పై థ్రిల్లర్స్ మాదిరిగానే ఇది కూడా సాగింది. టామ్ అండ్ జెర్రీని తలపించే కబీర్, విక్రమ్‌ల పోరాటం, ఎత్తుకు పైఎత్తులు ఆడియన్స్‌ని అలరియస్తాయి. ఓ క్రేజీ యాక్షన్ ట్రీట్ ఈ సినిమా. ఒకదాన్ని మించి ఒకటిగా ఇందులో యాక్షన్ సీక్వెన్స్ దర్శకుడు అయాన్ ముఖర్జీ డిజైన్ చేశారు. అలాగే కథలోని ట్విస్టులు, టర్నింగ్‌లు మంచి సర్ప్రైజ్ని ఇస్తాయి. డిఫరెంట్ మైండ్ సెట్‌తో, అందుకు తగ్గట్టు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో హృతిక్, తారక్ అదరగొట్టేశారు. కథ పాతదే అయినా.. కథనంలో ఆకట్టుకున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. అయితే.. స్టాంగ్ ఎమోషన్స్ లేకపోవడం ఈ కథలో పెద్ద మైనస్. కథలో దేశభక్తి ఉంది కానీ.. యాక్షన్ గోలలో పడి దాన్ని సరిగ్గా ఆవిష్కరించలేదేమో అనిపిస్తుంది. హీరోలిద్దరూ మధ్య గొడవకు దోహదపడ్డ పరిస్థితులు కాస్త బలంగా ఉంటే దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ కూడా బావుంది. కానీ ఈ సినిమాలో అదే లోపించింది. సెకండాఫ్ కాస్త డల్‌గా అనిపిస్తుంది.
నటీనటులు
ముఖ్యంగా తారక్ నటన, యాటిట్యూడ్ ఫ్యాన్స్‌కు మంచి విందు బోజనమే. ఇక హృతిక్ అయితే.. తన మార్క్ ప్రజెన్స్‌తో కట్టిపడేశాడు. ‘వార్ 1’ను మించి అలరించారాయన. ఇక యాక్షన్ పార్ట్‌లో అయితే.. ఆయన అలవోకగా చేసిన ఫైట్స్ సినిమాకే హైలైట్. అనిల్ కపూర్, అశుతోష్ రాణా ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. కియారా అద్వానీది ఇందులో లిమిటెడ్ రోల్. ఉన్నంతలో బాగానే చేసింది.
టెక్నికల్‌గా
ఇద్దరూ స్టార్ హీరోలను పెట్టి సినిమాను తీసినందుకు ముందుగా దర్శకుడు అయాన్ ముఖర్జీని మెచ్చుకోవాలి. ఒకరిని తక్కువ కాకుండా ఒకరిని ఎక్కువ కాకుండా హృతిక్‌ని, ఎన్టీఆర్‌ని బ్యాలెన్స్డ్గా అయాన్ చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆదిత్య చోప్రా రాసిన కథ బాగున్నా, అతడి పాత యాక్షన్ సినిమాలను ఇది గుర్తు చేస్తుంది. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను మెప్పిస్తుంది. బెంజమన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలను అత్యంత సహజంగా చిత్రీకరించారు. ప్రీతమ్ అందించిన పాటలు బాగున్నాయి. సంచిత్, అంకిత్ ద్వయం సమకూర్చిన నేపథ్య సంగీతం సినిమాపై బలమైన ప్రభావాన్ని చూపించింది. సినిమా నిర్మాణం ఉన్నతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ముఖ్యంగా విరామానికి ముందు ప్రైవేట్ జెట్‌లో వచ్చే సన్నివేశాలు కొంత అతిశయంగా అనిపిస్తాయి. మొత్తానికి, ‘వార్ 2’ ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా ఎన్టీఆర్, హృతిక్ అభిమానులను, యాక్షన్ ప్రియులను అలరించేలా ఉంది.
బలాలు
హృతిక్, తారక్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్, నేపథ్య సంగీతం..
బలహీనతలు
కథ, కొన్ని పేలవమైన సన్నివేశాలు..
రేటింగ్ : 3/5