హైదరాబాద్ : ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో ఇండియా తరఫున చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దుబిడ్డ చికితను(Chikita )అభినందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తి ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో అండర్-21 మహిళల విభాగంలో స్వర్ణ పతకం సాధించడంపై డిప్యూటీ సీఎం భట్టి హర్షం వ్యక్తం చేశారు. విశ్వవేదికలపైనే దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న చికిత మరిన్ని ఘన విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
శనివారం కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిన టోర్నమెంట్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచిన చికిత దేశానికి, రాష్ట్రానికి గర్వకారణమన్నారు. 20 ఏళ్ల ఈ యువ ఆర్చర్ టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించిందని ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికలపైన భవిష్యత్తులో సైతం చికిత ఇలాంటి అద్భుత విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాగా, ఆగస్టు 28 సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న చికిత తానిపర్తికి స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.