సినిమా పేరు: కూలీ
తారాగణం: రజనీకాంత్, నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీ హాసన్..
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: కళానిధి మారన్
నిర్మాణం: సన్ పిక్చర్స్
రజనీకాంత్ సినిమా అంటే హైప్ సర్వసాధారణం. దానికి తోడు ‘కూలీ’ సినిమాలో విలన్‌గా చేసింది నాగార్జున. వీరిద్దరితోపాటు అమీర్‌ఖాన్, ఉపేంద్ర స్పెషల్ ఎట్రాక్షన్. ఇక తలైవా సినిమా అంటే అనిరుథ్ ఏ రేంజ్లో రెచ్చిపోతాడో తెలిసిందే. ముఖ్యంగా బ్లాక్‌బస్టర్స్ ఖైదీ, విక్రమ్, లియోల తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. అన్నింటినీ మించి రజనీకాంత్‌ని లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా. ఈ కారణాలు చాలవా ‘కూలీ’పై అంచనాలు ఆకాశంలో ఉండటానికి!? ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘కూలీ’ ఈ గురువారం థియేటర్లలోకి అడుగుపెట్టాడు. మరి అందరి అంచనాలనూ ‘కూలీ’ నిజం చేశాడా? తలైవా ఖాతాలో హిట్ పడినట్టేనా? లోకేష్ కనకరాజ్ విజయయాత్ర కొనసాగుతున్నట్టేనా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
సైమన్(అక్కినేని నాగార్జున) పేరు మోసిన స్మగ్లర్. ఓ షిప్యార్డ్ని అడ్డాగా చేసుకొని తన కార్యకలాపాలు కొనసాగిస్తుంటాడు. స్మగ్ల్గూడ్స్, బంగారం ఇల్లీగల్‌గా ఎగుమతీ, దిగుమతులు అతని వృత్తి. అతని అనుంగు అనుచరుడు దయాళ్(సౌబిన్ షాహిర్). సైమన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఇతని కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. మహాక్రూరుడు. ఇదిలావుంటే.. మరణించిన జంతువుల క్రిమేషన్ కోసం రాజశేఖర్(సత్యరాజ్) ఓ ఎలక్ట్రిక్ ఛైర్‌ని తయారు చేస్తాడు. ఇలాంటి ఛైర్ కారణంగా మంచితోపాటు చెడు కూడా జరిగే అవకాశం ఉందంటూ ప్రభుత్వ ప్రతినిథులు అభిప్రాయపడతారు. దాంతో ఆ ఛైర్‌ని మార్కెట్లోకి తెచ్చేందుకు గవర్నమెంట్ పర్మిషన్ రాదు. తన శ్రమంతా వృధా అయిపోతుందనుకొని రాజశేఖర్ బాధ పడుతున్న సమయంలో అతనికి సైమన్ నుంచి కబురు వస్తుంది. తాను చంపిన శవాలను బూడిద చేసేందుకు ఆ ఛైర్ కావాలంటాడు సైమన్. సహకరించపోతే కూతుళ్లను చంపుతానని బెదిరిస్తాడు. దాంతో కుటుంబం కోసం తప్పక సైమన్‌తో చేయి కలుపుతాడు రాజశేఖర్. సైమన్ చంపిన శవాలను ఆ కుర్చీ సహాయంతో బూడిద చేస్తుంటాడు. తన కుమార్తె ప్రీతి(శ్రుతిహాసన్) రాజశేఖర్‌కు ఈ విషయంలో సహాయం చేస్తుంటుంది. ఇదిలావుంటే.. ఉన్నట్టుండి రాజశేఖర్ మరణిస్తాడు. ఆ మరణవార్త విన్న రాజశేఖర్ ప్రాణస్నేహితుడు దేవా(రజనీకాంత్) షాక్ అవుతాడు. రాజశేఖర్‌ది సహజ మరణం కాదని, అతన్ని కొట్టి చంపారని దేవాకు తెలుస్తుంది. అంతేకాక, రాజశేఖర్ కుమార్తెలు ముగ్గురూ కూడా ప్రమాదంలో ఉన్నారని దేవాకు తెలుస్తుంది. దాంతో తన స్నేహితుడి పిల్లలకు దేవా అండగా నిలుస్తాడు. అసలు రాజశేఖర్‌ని చంపిందెవరు? రాజశేఖర్ పిల్లల్ని దేవా ఎలా కాపాడాడు? అసలు ఈ దేవా ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
ఒక సాధారణ కథా వస్తువుకు, చక్కని కథనాన్ని జోడించి, జనరంజకంగా చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ప్రథమార్ధం ఆడియన్స్ ముందు కొన్ని ప్రశ్నలుంచి, ద్వితీయార్ధంలో ఆ చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ సినిమాను ముగించాడు. ఆ చిక్కుముళ్లను ఆసక్తికరంగా విప్పితే సినిమా హిట్. ఈ విషయంలో కొంతవరకూ మాత్రమే విజయం సాధించాడు లోకేష్ కనకరాజ్. అసలు రాజశేఖర్, దేవా ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? వాళ్లిద్దరూ ఎలా విడిపోయారు? 30ఏండ్ల తర్వాత రాజశేఖర్ జీవితంలోకి దేవా రావడానికి గల కారణాలేంటి? ఇవన్నీ ఈ కథలో ఆసక్తికరమైన విషయాలు. రజనీకాంత్ క్యారెక్టరైజేషన్ నెక్ట్స్లెవల్లో డిజైన్ చేశారు లోకేష్. తనది కాని సమస్యలోకి ఎంటరై, ప్రమాదాలతో ఆడుకుంటూ.. రాజశేఖర్(సత్యరాజ్) కుమార్తెలను కాపాడుకుంటూ వెళ్తున్న దేవాను మనం ఫస్టాఫ్‌లో చూస్తాం. సెంకాడాఫ్కు వచ్చే సరికి అసలది తన సమస్యే అని తెలుస్తుంది. అదేంటనేది ఈ కథలో కీ పాయింట్. అయితే.. సినిమాలోని కొన్ని సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి. మొత్తం సినిమా అయితే ఆకట్టుకునేలాగే ఉంది.
నటీనటులు
దేవాగా రజనీకాంత్ నటనకు అభిమానులు ఉర్రూతలూగిపోవడం ఖాయం. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో మరోవైపు ఎమోషన్స్‌తో అదరగొట్టేశారు సూపర్‌స్టార్. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్‌లో వింటేజ్ తలైవాను చూసి తమిళ జనం ఊగిపోవడం ఖాయం. ఇక విలన్ సైమన్‌గా నాగార్జున ఆకట్టుకున్నారు. ఆయన లుక్ కూడా ైస్టెలిష్‌గా బావుంది. తొలిసారి ప్రతినాయకుడిగా కనిపించిన నాగ్.. ఎలా చేస్తారా? అని అందరూ అనుకుంటున్న సమయంలో ఓ కొత్త విలనిజాన్ని సిల్వర్‌స్క్రీన్‌కి ప్రజెంట్ చేశారు నాగ్. ఇక అతిథి పాత్రల్లో కనిపించిన ఉపేంద్ర, ఆమిర్‌ఖాన్‌లు కూడా సినిమాకు ప్లస్ అయ్యారు. ఈ సినిమా కీలకమైన పాత్ర సౌజిన్ షాహిర్ది. నిజంగా తను అద్భుతంగా నటించారు. ఇక శ్రుతిహాసన్ ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. సత్యరాజ్ కూడా ఉన్నంతలో మెరిపించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ సినిమాకు ఓ ఆకర్షణ.
టెక్నికల్‌గా
ఈ సినిమాకు కథనం ప్రధాన బలం. కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బావుండేది అనిపించింది. మొత్తంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాను జనం మెచ్చేలాగే తీశారు. ఇక అనిరుథ్ సంగీతం అదరహో అనిపించింది. కెమెరా వర్క్ కూడా చాలా బావుంది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అడుగడుగునా కనిపించింది. మొత్తంగా మాస్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు, ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులకు ‘కూలీ’ నచ్చుతుంది.
బలాలు
రజనీకాంత్, నాగార్జున నటన, స్క్రీన్‌ప్లే, అనిరుథ్ సంగీతం..
మైనస్‌లు
కథ, నాటకీయంగా అనిపించే కొన్ని సన్నివేశాలు ..
రేటింగ్ : 3/5