కడ్తాల్, జూన్ 23: విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా కస్తూర్బా విద్యాలయానికి సంబంధించిన నూతన భవవాన్ని ఎందుకు ప్రారంభించడంలేదని, భవనం ప్రారంభానికి తన పదవే అడ్డంకి అయితే రాజీనామా చేయడానికి సిద్ధమని జడ్పీటీసీ జర్పుల దశరథ్నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మండల కేంద్రంలో కేజీబీవీ విద్యాలయం కొన్ని ఏండ్లుగా అద్దె భవనంలో కొనసాగుతుందని, భవనంలో సరిపడా వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేజీబీవీ భవనం నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఎన్నో ఆటంకాల మధ్య పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయించడం జరిగిందని పేర్కొన్నారు.
భవన నిర్మాణ పనులు పూర్తయినా కేజీబీవీని ఎందుకు ప్రారంభించడంలేదని ప్రశ్నించారు. కుటిల రాజకీయాలతో కొంత మంది కాంగ్రెస్ నాయకులు పాఠశాల భవనం ప్రారంభించడానికి ఆలస్యం చేస్తున్నారని, అధికారులు ఎవరికి భయపడి అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మంత్రి సమయం ఇవ్వడంలేదంటూ, పాఠశాలను ప్రారంభించడానికి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మూడు సార్లు ఎంపీగా గెలుపొందిన నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి కేజీబీవీని ప్రారంభించాలని పేర్కొన్నారు. శిలాఫలకంపై తన పేరు వస్తుందనే అక్కసుతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు భవనం ప్రారంభించడంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.
ఒకవేళ కేజీబీవీ ప్రారంభానికి తన పదవి అడ్డొస్తే, ప్రొటోకాల్ ప్రకారం ప్రజలిచ్చిన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. పాఠశాల ఇంకా ప్రారంభంకాలేదని, విద్యార్థులకు సీట్లులేవని కుంటి సాకులు చెప్పి ఆమనగల్లు, కందుకూరు మండలాలకు చెందిన విద్యార్థులను బయటికి పంపించడం పద్ధతి కాదని అధికారులకు సూచించారు. వెంటనే పాఠశాలను ప్రారంభించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ఆనంద్, రైతు కమిటీ కోఆర్డినేటర్ వీరయ్య, ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు సేవ్యానాయక్, వెంకటయ్యయాదవ్, మాజీ సర్పంచ్లు తులసీరాంనాయక్, హరిచంద్నాయక్, నర్సింహాగౌడ్, భూనాథ్నాయక్, జంగయ్యగౌడ్, సాయిలు, నాయకులు రామచంద్రయ్య, వినోద్, పాండూనాయక్, శ్రీనివాస్, గోపాల్, అంజి, కృష్ణ, శ్రీకాంత్, గణేశ్, మహేశ్ పాల్గొన్నారు.