వికారాబాద్, జనవరి 11, (నమస్తే తెలంగాణ): ఐకేపీ డబ్బులు స్వాహా పేరిట గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. గురువారం మద్దుల్చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్ ఐకేపీ డబ్బులు స్వాహాపై మాట్లాడుతూ అమాయకులైన ఐకేపీ సభ్యులకు అందాల్సిన కమీషన్ డబ్బులను నొక్కేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్వయం సహాయక సంఘాలకు రుణాలను మంజూరు చేయడంలోనూ అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అవినీతికి పాల్పడిన డీపీఎంను సస్పెండ్ చేస్తామని, సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ కమీషన్ డబ్బుల్లో అవినీతికి పాల్పడిన బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిని ప్రజాప్రతినిధులు నిలదీయగా డీపీఎం స్థాయి అధికారి ఈ విధంగా అవినీతికి పాల్పడడంపై తాను సిగ్గుపడుతున్నానంటూ సమాధానమిచ్చారు.
మన ఊరు-మన బడిలో భాగంగా స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.10కోట్లను వెంటనే ప్రభుత్వం విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని సభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. స్కూల్ కమిటీ చైర్మన్లు ముందుకు వచ్చి పనులు చేశారని, బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సభా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా సీఎంఆర్ రైస్ అవకతవకలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి పెట్టాలని, సీఎంఆర్ రైస్‌ను నిర్ణీత సమయంలోగా తిరిగివ్వకుండా పక్కదారి పట్టిస్తున్న రైస్మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు.
రైస్‌మిల్లర్లు తిరిగివ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని కర్ణాటక, మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారని దౌల్తాబాద్ జడ్పీటీసీ మహిపాల్ ఆరోపించారు, దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ధాన్యానికి తగిన విధంగా సీఎంఆర్ రైస్ తిరిగి ఇస్తున్నారని, సీఎంఆర్ రైస్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై దృష్టి సారించామన్నారు. మరోవైపు కర్ణాటక సరిహద్దులోని మన జిల్లాకు సంబంధించిన 1500 ఎకరాల భూములను ఆ రాష్ట్ర రైతులు ఆక్రమించి వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు.
దీనిపై గతంలోనూ ఫిర్యాదు చేశామని, బషీరాబాద్ మండలంలోని 5-6 గ్రామాల పరిధిలో, కొడంగల్ పరిధిలో ఆక్రమణలున్నాయని బషీరాబాద్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, త్వరలోనే జాయింట్ సర్వే నిర్వహించి ఆక్రమణదారుల నుంచి జిల్లా భూములను స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా మర్పల్లి మండలం తుమ్మలపల్లిలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఓ ప్రైవేట్ వెంచర్ నిర్వాహకులు 100 ఎకరాల వరకు ఎఫ్టీఎల్ భూములను కబ్జాకు పాల్పడడంతోపాటు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలను చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మర్పల్లి జడ్పీటీసీ సమావేశం దృష్టికి తీసుకురాగా, త్వరలో పరిశీలిస్తామని డీపీవో తరుణ్‌కుమార్ సభా ముఖంగా వెల్లడించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పూర్తైన పనులకు సంబంధించి ఎంబీ రికార్డు చేయాలని కోరుతుంటే.. “మీది ఏ పార్టీ” అని తాండూరు పంచాయతీరాజ్ ఏఈ అడుగుతున్నారని దౌల్తాబాద్ జడ్పీటీసీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ పంచాయతీరాజ్ ఏఈలపై ఈమధ్య చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రొటోకాల్ పాటించాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులను గౌరవించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా 15 రోజుల్లోగా పూర్తైన పనులకు సంబంధించి ఎంబీ రికార్డులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో సుభాషిణి, ఆయా శాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసేందుకు ఎన్ని నిధులైనా మంజూరు చేసేలా చర్యలు చేపడుతామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో ఎక్కడైతే సమస్యలున్నాయో అంచనాలను పూర్తి చేస్తే నిధులు తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలోకి నడిపించేందుకు తనవంతు కృషి చేస్తాన్నారు. మరోవైపు అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని, అవినీతికి, అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
బొంరాస్‌పేట మండలం బురాన్‌పూర్ ఐకేపీ సభ్యులకు అందాల్సిన పదిలక్షల కమీషన్ డబ్బులను స్వాహాచేసిన డీపీఎం వీరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీపీఎంతో పాటు బురాన్‌పూర్ వీవోఏ నర్సింహులును విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే యాసంగిలో ఆరుతడి పంటలను రైతులు సాగు చేసేలా రైతులకు సలహాలు, సూచనలు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి సూచించారు. జొన్న, నూనెగింజల సాగు రానురాను తగ్గిపోతుందని, నూనెగింజల సాగు పెంచేలా అవగాహన కల్పించాలన్నారు. తేనేటీగల పెంపకంపై కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా ఆర్గానిక్ పంటలకు మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా ఆర్గానిక్ పంటలను సాగు చేసేలా రైతులకు ప్రోత్సహించాలన్నారు.
వానకాలంలో వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జడ్పీ చైర్పర్సన్ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి జిల్లాకు సాగు, తాగునీరందించాలన్నారు. పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను రాబట్టే విధంగా ప్రత్యేక కార్యాచరణతో పిల్లలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు మరిన్ని ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.