మర్పల్లి, జనవరి 21 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తండాలను గుర్తించిన సీఎం కేసీఆర్ తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. దీంతో తండాలకు అభివృద్ధి ఫలాలను నేరుగా అందించడంతో నేడు తండాల్లో సమస్యలు తీరి సంతోషంగా ఉన్నామని తండా వాసులు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నో ఏండ్లుగా పాలించిన ప్రభుత్వాలు తండాల ప్రజలను గుర్తించలేదు, సీఎం కేసీఆర్ ప్రభుత్వం తండావాసుల బాధలను గుర్తించి అభివృద్ధి ఫలాలు అందించారని కొనియాడుతున్నారు. ప్రభుత్వం నిర్వహించిన పల్లె ప్రగతి ప్రణాళిక కార్యాచరణ పనులతో తండాల్లో రూపురేఖలు మారాయి. తండాల్లో ఏండ్ల తరబడి తిష్టవేసిన సమస్యలు సైతం పరిష్కారమయ్యాయి.
సీఎం కేసీఆర్ చొరవతో మండలంలోని అన్ని తండాలు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నాయి. అందులో ఒకటిగా గుర్రంగట్టు తండా సుందరంగా మారింది. తండాలో బహిరంగ మలవిసర్జన చేయకుండా తండా వాసులకు అవగాహన కల్పించడంతో మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించుకుంటున్నారు. తండాలో సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, కంపోస్టుషెడ్డు నిర్మాణాలు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నారు. మురుగు కాలువలు నిర్మాణం చేపట్టారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ సారు అభివృద్ధికి నోచుకోని తండాలను గుర్తించి, తండావాసుల అభ్యున్నతి కోసం.. మా బాధలను అర్థం చేసుకుని పంచాయతీలుగా ఏర్పాటు చేయడం మాకు సంతోషంగా ఉంది. పంచాయతీలుగా చేయడంతో మా తండాలకు నిధులు రావడం, అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. అధికారులు, తండా వాసుల సహకారంతోనే తండాలో అభివృద్ధి సాధ్యపడింది. మా తండాల్లో ఎన్నో ఏండ్ల నుంచి కనిపించని అభివృద్ధి సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
-సోనీబాయి, సర్పంచ్ గుర్రంగట్టు తండా