
రేపు రాఖీపౌర్ణమి
మన సంస్కృతిలో భాగం
ఆన్లైన్లో రాఖీలు
ఆలేరుటౌన్, ఆగస్టు 20 : రాఖీ.. అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు ఆత్మీయ అనుబంధాన్ని పంచుకునే పర్వదినం. తోడబుట్టిన వారు లేని సోదరీమణులకు కూడా సోదర ప్రేమను పంచిపెట్టే శుభదినం. రక్తం పంచుకుని పుట్టినవారైనా.. కాకున్నా.. వారి కోరికలన్నీ నెరవేరాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ నిండు మనసుతో సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరిమనులు ఉవ్విళ్లూరే ప్రత్యేక పండుగ. శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. అమ్మలోని మొదటి అక్షరం.. నాన్నలోని మరో అక్షరం కలిస్తే అన్న.. అందుకే తాను జీవించినంత కాలం అమ్మలా ఆదుకుంటాడని, నాన్నలా రక్షిస్తాడని భావిస్తూ అన్నకు చెల్లెలు రాఖీ కడుతుంది.
వేదకాలం నుంచే
మానవ సంబంధ అనుబంధాలకు పెద్దపీట వేసే మన దేశంలో వేదకాలం నుంచే రాఖీ పండుగను జరుపుకుంటున్నట్లు తెలుస్తున్నది. యమధర్మరాజుకు ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున ఆయన చెల్లెలు యమున రాఖీ కట్టేదట. ఆ కారణంగానే శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటున్నారని ప్రతీతి. అలాగే రాజపుత్ర మహారాణి కర్ణావతి అప్పటి మొగల్ చక్రవర్తి హుమాయున్‌కు రాఖీ కట్టిందట. అలెగ్జాండర్ తన జైత్రయాత్రలో భాగంగా యుద్ధం చేయటానికి పురుషోత్తముని రాజ్యానికి వస్తాడు. అలెగ్జాండర్ భార్య రుక్సానాబేగం పురుషోత్తముని బలాన్ని ముందే పసిగట్టి విజయం సాధిస్తారని భావిస్తుంది. దీంతో ఆమె యుద్ధానికి ముందే పురుషోత్తముడికి రాఖీ కట్టి తన భర్త అలెగ్జాండర్‌ను కాపాడాలని వేడుకుంటుంది. ఈ క్రమంలో యుద్ధ సమయంలో అలెగ్జాండర్‌పై పురుషోత్తముడు కత్తి ఎత్తిపట్టినప్పుడు రుక్సానాబేగం కట్టిన రాఖీ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే యుద్ధంలో పురుషోత్తముడు తప్పుకుంటాడని చరిత్ర చెబుతుంది.
ఎన్నో వెరైటీలు ..
రకరకాల రంగులు.. రూపాలు.. హంగులు.. సమకూర్చుకొని కొత్తగా ఆకర్ణణీయమైన రాఖీలు మార్కెట్లోకి వచ్చా యి. వినాయకస్వామి, రుద్రాక్షలు, రకరకాల పుష్పాలు.. చిన్నపిల్లల మనసు దోచే చోటా బీమ్, మిక్కిమౌస్, యాం గ్రీబర్డ్స్ వంటి వెరైటీ రాఖీలు అమ్ముతున్నారు. తక్కువ నాణ్యతగల వజ్రాలు పొదిగిన రాఖీ, బంగారు పూతతో చేసిన రాఖీ, ముత్యాల జర్దోసీ రాఖీ ఇలా ఎన్నెన్నో రాఖీలు ఉన్నాయి.
ఆన్లైన్లో రాఖీలు
ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే రాఖీ కొనాలి.. దాన్ని పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపించేందుకు సెంటర్లకు వెళ్లడం, కవర్లు కొనడం వంటి తతంగాలు ఉండేవి. అవి సమయానికి చేరుతాయో లేదో అనే సందేహం ఉండేది. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు ఆన్లైన్ ద్వా రా రాఖీలు పంపించే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక్క క్లిక్ ద్వారా నిర్ణీత చిరునామాకు రాఖీ చేరిపోతుంది. జిల్లా, రాష్ట్రం, దేశం, విదేశాల్లో ఎక్కడికైనా రాఖీ పంపించే సౌకర్యాన్ని పలు వెబ్సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. ఆన్లైన్లో కూడా వేల సంఖ్యలో రకరకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా సోదరులు ఇష్టపడే బహుమతులను కూడా ఆన్లైన్లో పంపించవచ్చు. రాఖీ పంపిన సోదరీమణుల కోసం సోదరులు ఆన్లైన్లో వారికి చీరెలు, వాచీలు, బ్యాగులు, బహుమతులు (రిటర్న్గిఫ్ట్స్ ) పంపవచ్చు. ఆన్లైన్లో అయితే సకాలంలో డెలివరీ అవుతాయి. స్థోమతను బట్టి రాఖీలను ఎంపిక చేసుకోవచ్చు. బిజీగా ఉండేవారికి ఆన్లైన్ మంచి అవకాశం.
మమకారానికి ప్రతిరూపం
మమకారానికి ప్రతిరూపం రక్షాబంధన్. రాఖీ పండుగ వచ్చిందంటే మా ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి రాఖీ పౌర్ణమి రోజు మా సోదరుడుడికి రాఖీ కట్టి ఆశీర్వదిస్తా. మా ప్రేమానురాగాలు మర్చిపోలేనివి. సోదరుడు ఇచ్చిన కానుకలు వెలకట్టలేనివి.
-గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్
అనురాగం మరువలేను
మా అక్కల అనురాగాన్ని మరువలేను. ఇద్దరు అక్కలతో ప్రతి ఏటా రాఖీ కట్టించుకుంటాను. వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటాను. పండుగ రోజు ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం అలవాటు. నా అభివృద్ధికి వారు ఎంతగానో తోడ్పడ్డారు.
-సుంచు మహేశ్, ఆలేరు