Driving Licenses | సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఏటేటా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతున్నది. అటు స్వయం ఉపాధిలోనూ ఇటు ఉద్యోగాల్లోనూ నగరంలో మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా ద్వి చక్ర, కారు లైసెన్సులు పొందుతున్న మగువల శాతం కూడా అదే స్థాయి లో ఉన్నది. కార్యాలయాలకు వెళ్లడం .. పిల్లలను స్కూళ్ల వద్ద దింపడం, పండుగలకు ఊరెళ్లడం వంటి పనులు సమయానుసారంగా చేసుకునేందుకు వీలుగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. దీంతో వీరి సంఖ్య కొంతకాలంగా క్రమం గా జోరందుకున్నది. గతేడాది 43,774 మంది మహిళలు లైసెన్స్‌లు పొందగా ఈ ఏడాది జనవరి నెల ముగిసేలోపే 1778 మంది మగువలు లైసెన్స్ పొందారు. .
కారు లైసెన్సులే ఎక్కువ
నగరంలో సుమారు 400లకు పైగా డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. వీటితోపాటు మరో 50- 60 వరకు మారుతి, టయోటా లాంటి కంపెనీ డ్రైవింగ్ స్కూళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక్కో బ్యాచ్‌కు కనీసం 20-35 మంది చొప్పున కారు నడపడం నేర్చుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో 2019 నుంచి ప్రస్తుతం వరకు సుమారు 2 లక్షలకు పైగా మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఇందులో అధిక భాగం కారు లైసెన్స్ ఉన్నవాళ్లే.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇలా…
2019 -30555
2020 -20851
2021 -29,898
2022 -31,902
2023-42,557
2024 -43,774
2025 -1778 (ప్రస్తుతం)