యాచారం జూలై 6 : ఫార్మాసిటీ ఏర్పాటు కోసం పట్టా భూములు ఇవ్వని రైతుల భూముల జోలికి వెళ్లబోమని చెప్పిన అధికారులు ఆ రైతులకు ఫార్మా ప్లాట్లు ఎందుకు ఇస్తున్నారని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి ప్రశ్నించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన 2,500 ఎకరాలకు సంబంధించిన పట్టా భూములను రైతులు ఫార్మాసిటీకి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
భవిష్యత్తులోనూ ఆ భూములను సర్కారుకు రైతులు ఇవ్వరన్నారు. ఫార్మాకు భూములివ్వని రైతులకు ఫార్మా ప్లాట్లు అవసరం లేదని.. అయినా.. వారి పేర్లను ఫార్మా ప్లాట్ల జాబితాలో ఎందుకు పెట్టారని అధికారులు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2500 ఎకరాల భూములకు సంబంధించి కోర్టులో స్టే ఉన్నదని, కోర్టులో స్టే ఉన్న భూములకు సంబంధించి రైతులకు పరిహారం కింద ప్లాట్లు ఎలా పంపిణీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాట్లు ఇస్తున్నామని చెప్పి రైతులను పిలిపించి వారితో మోసపూరితంగా సంతకాలు చేయించుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్టున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
అందువల్ల రైతులు అసైన్డ్ భూములకు సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చదివి సంతకాలు చే యాలని సూచించారు. అసైన్డ్ భూములు మినహా ఫార్మాకు ఇవ్వని పట్టా భూములకు చెందిన రైతులు ఎక్కడ ఎలాంటి సంతకాలు చేయొద్దన్నారు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని ఫార్మా ప్లాట్ల పేరుతో భూములిచ్చినట్లు సంతకాలు చేయించుకొని కోర్టులో చూపించే ప్రమాదం ఉన్నదన్నారు.
ప్లాట్లకు కక్కుర్తి పడి ఎక్కడా సంతకాలు చేయొద్దని.. అధికారులు, ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ భూములను వదులుకునేది లేదని రైతుల తరఫున ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఫార్మాసిటీకి భూములివ్వని రైతులంతా ఐక్యంగా ఉండాలన్నారు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఆన్ లైన్లో రైతుల పేర్లను నమోదు చేసే వరకు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతుల తరఫున నిరంతరం పోరాటం చేస్తామని, ఇందుకు రైతులు సహకరించాలన్నారు.