సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): శ్రావణ మాసం వచ్చింది.. వస్తూ వస్తూ కల్యాణ ఘడియలు తీసుకొచ్చింది.. నిన్నమొన్నటి వరకు ఆషాఢం.. మూఢం అని కల్యాణ ఘడియలకు దూరమైన వారు ఇక భాజా భజంత్రీలు మోగించనున్నారు. వధూవరులను ఒక్కటి చేయనున్నారు. ఇక ఊరూవాడ అన్నప్రాశన, పంచెకట్టు, గృహప్రవేశ వేడుకలూ జరగనున్నాయి. షామియానాలు, క్యాటరింగ్, టెంట్‌హౌస్, డెకరేటింగ్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, అర్చకులకు ఉపాధి లభించనున్నది. వీరే కాదు ఇంకో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.
శ్రావణం దాటితే మరో నాలుగు నెలలు ఆగాల్సిందే
ఈ నెలలో 3, 4, 5, 6, 10, 11, 13 వచ్చే నెల 1, 7, 20, 21 వరకే ముహూర్తాలు ఉన్నాయి. ఈ ముహూర్తాలు వెళితే మళ్లీ డిసెంబర్ వరకు ముహూర్తాలు లేవు. డిసెంబర్లో మంచిరోజులు 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. అప్పటివరకు శుభకార్యాలు ఆగిపోయినట్లే.
పండుగలూ శ్రావణంలోనే..
శ్రావణ మాసం పూర్తిగా ఆధ్యాత్మిక మాసం. ఏ కుటుంబం చూసినా పండుగలు, మొక్కులు అంటూ బిజీ అవుతారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలకు బోనమెత్తుతారు.ఈ మాసంలో ప్రతి శుక్రవారాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఇదే మాసంలో రాఖీపౌర్ణమి, కృష్ణాష్టమి వస్తాయి. 12న రాఖీపౌర్ణమి, 19 కృష్ణాష్టమి, 24న ఏకాదశి వ్రతం. ఈమాసమంతా మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటారు. శ్రావణమాసంలో ఇండ్లన్నీ అధ్యాత్మిక కేంద్రాలవుతాయి. కొత్త ఇండ్లు నిర్మించుకున్న వారు గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు.
మారిన పెళ్లి ట్రెండ్
‘పెళ్లి’ జీవితకాలం గుర్తుంచుకునే ఓ తీపి జ్ఞాపకం.. ఆ జ్ఞాపకాన్ని మరింత మధురంగా మార్చుకుంటున్నారు వధూవరులు, వారి తల్లిదండ్రులు. ఇక శ్రావణమాసం వచ్చేసింది. ఈ కల్యాణ తమ కుమారులు, కుమార్తెలకు పెండ్లి చేయాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఘడియల్లో పాతకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. తలా ఒక చేయేస్తే పనులన్నీ చకా చకా పూర్తయ్యేవి. రాను రాను ఉమ్మడి కుటుంబాలు ఛిన్నాభిన్నం అయి మైక్రో ఫ్యామిలీలు ఏర్పడ్డాయి. దీంతో శుభకార్యాల సమయంలో ఈవెంట్ మేనేజర్స్‌ను ఆశ్రయిస్తున్నారు తల్లిదండ్రులు. డెకరేషన్ నుంచి క్యాటరింగ్ వరకు ఇక అన్ని పనులను ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటున్నారు. తాహతును బట్టి గ్రాండియర్‌గా ప్లాన్ చేస్తున్నారు. ‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి..’ అని ఓ సినీ కవి అన్నట్లు అబ్బురపడేలా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. షామియానాలు, విద్యుద్దీపాలు, గుర్రపు బగ్గీలు, సంగీత్.. ఇలా ఒకటేమిటి పెళ్లి తతంగమే మారిపోయింది. ముత్యాల తలంబ్రాలు, సప్తపది, గంగ్రోతి స్నానం, పల్లకీ, పెళ్లికుమార్తెను మేనమామలు తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసే బుట్ట, సానరాయి, కొబ్బరి కుడకలు, ఉంగరాల బిందె, చెంబు తాంబూలం, గరికె ముంత, నాగవల్లి కుండలు, అడ్డుతెర, పెళ్లి కొడుకు ఒడుగు సమయంలో కావాల్సిన సామగ్రి, అలాగే కాశీకి వెళ్లినప్పుడు కావాల్సిన చెప్పులు, గొడుగు.. ఇలా ఏది కావాలంటే అది వెడ్డింగ్ ప్లానర్స్ సిద్ధం చేస్తున్నారు. వధూవరులను ఊరేగించడానికి ముత్యాల పల్లకీ, రథాన్ని తీసుకొస్తున్నారు. వధూవరులపై పూలు పడేలా ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ముత్యాల పల్లకీ ఎదురుగా మేఘాలు ఉన్నట్లు చూపుతూ క్రాకర్స్‌ను పేలుస్తున్నారు. ఇది ఒకవైపు అయితే మరోవైపు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఈవెంట్ల ద్వారా ఉపాధి పొందుతారు.
పవిత్ర మాసం..
శ్రావణం మాసం ఎంతో పవిత్రమైనది. హిందూ సంప్రదాయంలో సమయంలో ఈ మాసంలోనే ఎక్కువ శుభకార్యాలు జరుగుతాయి. నెల రోజులు పాటు ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెల దాటితే మళ్లీ మూఢాలే. నాలుగు నెలల వరకు మంచి రోజులు లేవు.
-రాధాకృష్ణశర్మ, అర్చకుడు
ఈ నెల 22 వరకు ముహూర్తాలు
ఆషాఢ మాసం ముగిసింది. శ్రావణంలోకి అడుగుపెట్టాం. మంచిరోజులు ఉన్నాయి. ఈ రోజుల్లోనే కల్యాణాలు, గృహ ప్రవేశాలు ఇతర శుభ కార్యాలు చేసుకోవాలి. కార్తీక, ఆశ్వయుజ మాసాల్లో మంచి రోజుల లేవు. మార్గశిర మాసంలో మళ్లీ ముహూర్తాలు ఉంటాయి. ఈ నెల 4, 5, 8, 10, 11, 13, 14, 17, 20, 21 తేదీల్లో శుభ కార్యాలు చేసుకోవచ్చు.
-తాటికొండల సీతారామశాస్త్రి