పరిగి/షాబాద్, మే 20 : పెళ్లింట విషాదం నెలకొన్నది. వధువు ఇంటికి విందుకు ఓ ప్రైవేట్ బస్సులో వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. 31 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై పరిగి మండలంలోని రంగాపూర్ స్టేజీ సమీపంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఈ యాక్సిడెంట్‌తో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయా యి. షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామానికి చెందిన మంగళి రామస్వామి-మంజుల దంపతుల కుమారుడు సతీశ్ వివాహం పరిగికి చెందిన అమ్మాయితో ఈ నెల 16న జరిగింది. అయితే సోమవారం చిన్న విందుకోసం చందనవెల్లి గ్రామం నుంచి ఓ అద్దె బస్సులో 50 మంది పరిగికి వెళ్లారు. అక్కడ విందు ముగించుకుని సుమారు అర్ధరా త్రి 1.40 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా రంగాపూర్ సమీపం లో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సోలీపేట్ గ్రామానికి చెందిన మంగలి బాలమ్మ, సీతారాంపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్, కిషన్‌నగర్‌కు చెందిన సందీప్, చేవెళ్ల మండలంలోని రావులపల్లికి చెందిన హేమలత అక్కడిక్కడే మృతిచెందారు. మరో 31 మందికి గాయాలు కాగా.. వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాళ్లు విరిగిన మమతను ప్రాథమిక చికిత్స అనంతరం గాంధీకి, చిన్నారి మోక్షితను హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు.
వారితోపాటు నీరజ, కార్తీక్, లక్ష్మి, రమేశ్, సాత్విక్, మహేశ్, సుజాత, నవనీత, అరు ణ, సుజాత, ప్రియాంక, సుజాత, డ్రైవర్ యూసుఫ్, రవీందర్, మం జుల, రాములు, ఆధ్యశ్రీ, శ్రీజ, శ్రావణి, సాహితీ, ప్రణిత, శ్రీనిధి, యా దమ్మ, లక్ష్మమ్మ, ఫొటోగ్రాఫర్ నరేశ్, రాకేశ్, సురేందర్, నూతన వధూవరులు మల్లీశ్వరి, సతీశ్‌లకు గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని 108 అంబులెన్స్‌ల్లో పరిగి, వికారాబాద్ దవఖానలకు తరలించారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా, అతివేగంగా నడిపించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలానికి డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, పరిగి ఎస్ఐ సంతోష్‌కుమార్ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను పోలీసులు కష్టపడి బయటికి తీసుకొచ్చారు.
ఈ దుర్ఘటనతో పరిగి ఆసుపత్రి ప్రాంగణంలో మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో చందనవెల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మంగళి బాలమ్మ(పెళ్లి కొడుకు అమ్మమ్మ), మల్లేశ్(బావ), సందీప్ (మేనబావ), హేమలత(చిన్నమ్మ) మృతిచెందారు. మల్లేశ్ పెళ్లి జరిగి ఆరేండ్లు కాగా.. అతడికి భార్య స్వప్న, ముగ్గురు పిల్లలున్నారు. అదేవిధంగా సందీప్‌కు ఆరు నెలల కిందటే వివాహం కాగా.. అత డి భార్య ప్రస్తుతం గర్భవతి. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స, తక్షణ సహాయక చర్యలను అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరామర్శించారు. రోడ్డు ప్రమాదంపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ
సానుభూతిని ప్రకటించారు.