Minister Sridhar Babu | మొయినాబాద్ : రామరాజ్యం పేరుతో అరాచకాలు సృష్టిస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్ రెడ్డి, తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేందర్‌శర్మ, యాదాద్రి దేవస్థానం రిటైర్డ్ అర్చకుడు కారంపూడి నర్సింహాచార్యులు, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి తనుగుల రత్నాకర్, వివిధ బ్రహ్మాణ సంఘాల నాయకులు మంగళవారం చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకున్నారు.
ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర రాజన్ ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్చకులు రంగరాజన్‌తో మాట్లాడి.. దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిలుకూరు బాలాజీ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాముడి పేరుపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రంగరాజన్‌పై దాడి జరగడం అమానవీయ చర్య అని పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ప్రభుత్వం మరింత భద్రత పెంచుతుందని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే పోలీసులు కొందరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగిందని చెప్పారు.
దేవుడి పేరు, రాముడి పేరుతో దాడులు చేయడం దురదృష్టకరమని చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. నిందితులు ఎవరైనా ప్రభుత్వం వారిని శిక్షిస్తుందని తెలిపారు. మంత్రి వెంట టీపీసీసీ సభ్యులు షాబాద్ దర్శన్, చిలుకూరు మాజీ సర్పంచ్ పురాణం వీరభద్ర స్వామి, హిమాయత్ నగర్ మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ్, పెద్ద మంగళారం మాజీ సర్పంచ్ రామకృష్ణ గౌడ్, కనకామామిడి మాజీ సర్పంచ్ పీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మందడి చంద్రారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రాజేశ్ గౌడ్, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విఘ్నేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేతలు గడ్డం వెంకట్ రెడ్డి, ఈగ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కొత్తపల్లి విక్రమ్‌రెడ్డి, రేనెట్ల రాజు గౌడ్ పాల్గొన్నారు.