Water Problems | వికారాబాద్, మే 24 : గత పదేండ్లుగా రాని నీటి సమస్య ఇప్పుడు వచ్చింది. చిన్న పాటి సమస్యను పరిష్కరించక పోవడంతో కాలనీ వాసులకు 4 రోజులుగా మిషన్ భగీరథ నీరు అందడం లేదు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు ధన్నారంలో గత 4 రోజుల క్రితం మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే వాల్ వద్ద సమస్య ఏర్పడింది. దీంతో మిషన్ భగీరథ నీరు ట్యాంకులోకి వెళ్లకపోవడంతో కాలనీ వాసులకు నీటి సరఫరా నిలిచిపోయింది.
అదే విధంగా కాలనీలో రెండు బోర్లు కూడా చెడిపోయి నిరూపయోగంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బోర్ల మరమ్మతులు చేయకపోవడంతో నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. నీరు లేక ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులకు మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. అవి అరకొరగా అందడంతో కాలనీ వాసుల సమస్యలు పూర్తిగా తర్చలేక పోరు. నీటి సరఫరా కాకపోవడంతో గ్రామస్తులు ఉదయం ఒక బోరు నుంచి 4 బిందెల చొప్పున వంతుల వారిగా పట్టుకోవాల్సి వస్తుంది. బోరు దూరంగా ఉండటంతో బిందెలతో నీటిని ఇంటికి తీసుకొచ్చేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు అవస్థలు పడాలి.. మా ఇబ్బందులను గుర్తించి నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.