Open Air Theatre | ఇష్టమైన ఫుడ్ తింటూ.. పచ్చిక బయళ్లలో చల్లని పిల్లగాలులు వీస్తుండగా ఆకాశ పందిరి కింద బిగ్ స్క్రీన్‌పై సినిమాను చూడాలని ఎవరు మాత్రం కోరుకోరు. అలాంటి మధురానుభూతిని సినీ ప్రియులకు అందించేందుకు ఇప్పుడు హైదరాబాద్ నగరం వడివడిగా దూసుకెళ్తున్నది. నేడు నగరంలో పలు ఓపెన్ ఎయిర్ థియేటర్స్ సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఈ ఓపెన్ ఎయిర్ స్క్రీన్స్ అందుబాటులో ఉంటున్నాయి. కాగా, ఒక్కరికి రూ.400 నుంచి 500 మధ్య టికెట్ ధరలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఓపెన్ ఎయిర్ థియేటర్స్‌లో సినిమా చూడటం గొప్ప అనుభూతిని పంచుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
ఇవిగో వేదికలు..
ఓపెన్ ఎయిర్ థియేటర్ల ట్రెండ్ నగరంలో జోరందుకుంటున్నది. గత ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొన్ని కేఫ్‌లలో ఆ ఒక్క రోజు పలు సినిమాలను ప్రదర్శించగా అమోఘమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అలాంటి వెన్యూలను రెస్టారెంట్లు, కేఫ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. నగరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్ల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో వన్ గోల్ఫ్ బ్రేవెరీలో సన్‌సెట్ సినిమా క్లబ్ ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో ఫెలికాలాంజ్ పెట్ ఫ్రెండ్లీ కేఫ్‌లోనూ ఉంది. అమీర్‌పేటలోని కార్నర్ సుండాఈలో అందుబాటులో ఉంది. రెగ్యూలర్ షోలను నడిపించేందుకు ఈ సంస్థ యోచిస్తున్నది.
ఓటీటీ దాటుకుని..
ఇప్పుడంతా ఓటీటీ. చాలా వరకు సినిమా థియేటర్లకు వెళ్లి చూడటం నగరవాసులు తగ్గించేశారు. వారం, రెండు వారాల్లో కొత్త సినిమాలు ఇంటి తెరలపై స్క్రీనింగ్ అవుతుండటంతో వారికి థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం అంతగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా ఓపెన్ ఎయిర్ థియేటర్ కాన్సెఫ్టు సక్సెస్ అయింది. చాలా మంది ఐటీ ఉద్యోగులు వీకెండ్లో ఇలా ఓపెన్ ఎయిర్ థియేటర్లలో సినిమాలు చూస్తూ సందడి చేస్తున్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్ మూవీలను చూసేందుకు నగరవాసులు చూపిస్తున్న ఆసక్తితోనే రెగ్యులర్ షోలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని సంబంధిత కంపెనీ ఓ సంస్థ మార్కెటింగ్ మేనేజర్ శివంగిని తెలిపారు.
సరికొత్త అనుభూతి
ఓపెన్ ఎయిర్‌లో సినిమా చూడటం కొత్త అనుభూతినిస్తున్నది. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని ఆస్వాదించాలి. మేం వీకెండ్లో హిందీ మూవీ చూశాం. మనకు నచ్చిన ఫుడ్ తింటూ సినిమా చూడటం చాలా గొప్పగా ఉంటుంది. ఎటు చూసినా ఓపెన్ ప్లేస్. వీకెండ్లో ఇలా ఔట్‌డోర్ సినిమా చూడటం కూడా ఇప్పుడు మా యాక్టివిటీలో భాగమైపోయింది.
-మధు, సాఫ్ట్వేర్ ఉద్యోగి