ఆదిబట్ల, సెప్టెంబర్ 9 : ఓ రియల్ ఎస్టేట్ సంస్థ జిలాన్ఖాన్ చెరువును మట్టితో పూడ్చి నిర్మాణాలు చేపట్టేం దుకు సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో వార్త ప్రచురితం కాగానే ఆదిబట్ల మున్సిపల్ అధికారులు స్పందించారు. టీపీవో హబీబున్నీసా తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన జిలాన్ఖాన్ చెరువుకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు.
అక్కడ నిర్మాణాలకు ఎలాంటి అనుమ తుల్లేవని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరూ నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరిగేషన్ అధికారుల వైఖరి మరో రకంగా ఉన్నది. ఆ శాఖలో అన్నీ తానై వ్యవహరించే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నిర్మాణాలు చేపడుతున్న స్థలాన్ని పరిశీలించి, అసలు ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాల్లేవని, నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశం ఎఫ్టీఎల్ పరిధిలో లేనే లేదంటూ బుకాయించాడు.
అయితే హెచ్ఎండీఏ అధికారులు 2017లోనే జిలాన్ఖాన్ చెరువును సర్వే చేసి మ్యాపింగ్ చేశారు. అప్పట్లో చెరువు సర్వేనంబర్ 122, 123, 125లో ఎఫ్టీఎల్ విస్తీర్ణం 24ఎకరా ల 32 గుంటలు ఉన్నట్లు తేల్చా రు. కాగా, సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మాత్రం హెచ్ఎండీఏ అధికారుల మ్యా పింగ్ తప్పని, అసలు చెరువు కబ్జానే కాలేదంటూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతుండడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పట్నం ఇరిగేషన్ శాఖను శాసిస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి..
ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ శాఖలో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చెప్పిందే వేదంలా మారింది. ఎక్కడైనా చెరువులు, కుంటలు కబ్జా అవుతు న్నా.. తాను కబ్జా కాలేదని రిపోర్టు ఇస్తే అదే ఫైనల్.. ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ శాఖలో వేల కు వేలు వేతనాలుగా తీసుకుని పనిచేస్తున్న ఇరిగేషన్ డీఈలు, ఏఈలు ఉన్నా లేనట్టే.. వారు ఏ ఒక్క రోజు కూడా చెరువులు, కుంటలను పర్యవేక్షించిన పాపానపోలేదని విమర్శలున్నాయి. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతుంటే.. సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నాడనే ఆరోపణలున్నాయి.