వరంగల్ చౌరస్తా, నవంబర్ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా వైద్యసేవలు అందించడంతోపాటు పర్యవేక్షణ చర్యలను పటిష్టం చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సీకేఎం వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సీకేఎం హాస్పిటల్‌ను సందర్శించి శానిటేషన్, మహిళలకు అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు. హాస్పిటల్ ఆవరణలో శానిటేషన్ మరింత మెరుగుపరచాలని, పిచ్చిమొక్కలను తొలగించి గార్డెనింగ్ సూచించారు. వైద్యాధికారులతో కలిసి వార్డులను పరిశీలించారు.
వైద్యసేవలు పొందుతున్న మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న డైట్ వివరాలను తెలియజేస్తూ వార్డుల్లో ఏర్పాటు చేయాల్సిన పోస్టర్లు డైట్ కాంట్రాక్టర్‌తోపాటు వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీస ట్పమాణాలు పాటించకపోవడంతో తగిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేసీఆర్ కిట్ల పంపిణీ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తక్కువ మంది సిబ్బందితో సేవలు కొనసాగిస్తున్నందున ఉద్యోగులు, సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారని, ఖాళీల భర్తీకి తగిన వైద్యాధికారులకు చెప్పారు.
సీకేఎం శానిటేషన్‌లో గందరగోళం
హాస్పిటల్లో ప్రస్తుతం 65 మంది శానిటేషన్ సిబ్బందితో షిఫ్టుల వారీగా పనిచేయిస్తున్నారు. హాస్పిటల్లో వైద్యసేవలు పెరగడంతో ప్రభుత్వం మరో 20 మంది శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు సూచన ప్రాయంగా అనుమతులు మంజూరు చేసింది. దీంతో ప్రతిభా వెల్ఫేర్ సొసైటీ ద్వారా నియామకాలు చేపట్టి, హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి వేతనాలు చెల్లిస్తుండగా, వారిని అధికారులు ఔట్సోర్సింగ్ పద్ధతికి మళ్లించే చర్యలు చేపట్టారు.
ఈ విషయాన్ని గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం వారు డాటా ఎంట్రీ, ఆఫీస్ అసిస్టెంట్, తదితర విధులు నిర్వర్తిస్తున్నారు. శానిటేషన్ మెరుగు పరిచేందుకు సిబ్బందిని నియమించుకోవాలని అనుమతులు కోరుతూ కార్యాలయ పనులు నిర్వహిస్తున్న వారిని ఔట్సోర్సింగ్ విధానంలోకి మళ్లించడం ద్వారా శానిటేషన్ పనులు చేయాల్సిన వారి నియామకాలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. దీంతో సీకేఎం హాస్పిటల్ శానిటేషన్ వ్యవస్థ ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.