రంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక కీలకమైన ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఎవరిని పలుకరించినా.. ఎక్కడ ఇద్దరు గుమికూడినా ఎవరు గెలుస్తారనే చర్చే జరుగుతున్నది. ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. విజయావకాశాలపై ఎవరికి వారుగా అంచనాల్లో నిమగ్నమయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు ఉన్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల లెక్కలు, ఆయా ప్రాంతాల్లో ఉన్న పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుని ఎవరికి వారుగా బయటకు ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపల మాత్రం ఒకింత భయం పార్టీలను వెంటాడుతున్నది.
చేవెళ్ల ఎన్నికలో ఏ అభ్యర్థి గెలుస్తాడో ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గందరగోళానికి తెరలేపుతున్నాయి.

కొందరు బీఆర్ఎస్కు అనుకూలంగా చెబితే.. కొందరు అధికార కాంగ్రెస్ పార్టీకి, మరికొందరు బీజేపీకే ఆధిక్యం అని ప్రకటిస్తుండడం అటు నేతలను, ఇటు ప్రజలను సందిగ్ధంలో పడేస్తున్నాయి. పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లే ఎక్కువగా ఈ ఎన్నికల్లో చైతన్యం చూపించారు. ఫలితంగా 2019 ఎన్నికల కంటే కాస్తంత ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ఎక్కువగా నమోదైన పోలింగ్ ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం! అన్నదానిపై ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నారు. ఏదిఏమైనా.. ఈ ఎన్నికల్లో కొంత మార్పు కనబడే అవకాశం ఉన్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుంచి రంజిత్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర్‌రెడ్డిలు పోటీ పడ్డారు. తొలి నుంచీ కాంగ్రెస్, బీజేపీలు ద్విముఖ పోటీగానే భావించాయి. ఆతర్వాత పరిస్థితులు మారడంతో త్రిముఖ పోటీ నెలకొన్నది. ఎవరికి వారుగా విజయావకాశాలపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించడం.. కేటీఆర్ రోడ్డు షోలు వంటి కార్యక్రమాలతో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని నేతలు పేర్కొంటున్నారు. గత పదేండ్లల్లో బీఆర్ఎస్ పాలనతో కాంగ్రెస్ ఐదు నెలల పాలనను పోల్చుకుని ప్రజలు ‘కారు’ వైపే మొగ్గు చూపారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదిఏమైనా.. నిశ్శబ్ద విప్లవంలో ఓటర్లు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీవైపు మొగ్గు చూపారన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఉత్కంఠ వీడాలంటే జూన్ 4వ తేదీ వరకు నేతలు వేచి చూడక తప్పదు.