పరిగి : ఓటర్ల తుది జాబితాను బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం.. వికారాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 8,96,892 మంది ఉండగా వారిలో పురుషులు 4,49,029 మంది, మహిళలు 4,47,839 మంది, థర్డ్ జెండర్ 24మంది ఉన్నారు. ఇదిలావుండగా 2021 నవంబర్ ఒకటో తేదీన విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం.. మొత్తం ఓటర్లు 9,01,126 ఉండగా తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 4234 మంది తగ్గారు. ముసాయిదా జాబితా ప్రకటించిన అనంతరం నవంబర్ 30వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు జిల్లాలోని 1130పోలింగ్ స్టేషన్లలో దరఖాస్తులు స్వీకరించారు.
అలాగే బూత్‌లెవల్ ఆఫీసర్లు నేరుగా గరుడయాప్లో నమోదు చేసే అవకాశం సైతం కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు 5714 మంది కొత్త ఓటర్లుగా నమోదై జాబితాలో చేర్చడం జరిగింది. కొత్తగా జాబితాలో చేరిన వారిలో పురుషులు 2927, మహిళలు 2787 ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పరిశీలిస్తే పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో 1644 మంది, వికారాబాద్‌లో 919 మంది, తాండూరులో 1579 మంది, కొడంగల్‌లో 1572 మంది పేర్లు కొత్తగా ఓటర్ల జాబితాలో నమోదు చేయబడ్డాయి. ఇకపోతే చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, రెండుచోట్ల పేర్లుంటే ఒకటి తొలగింపునకు దరఖాస్తులకు సంబంధించి జిల్లాలో 9946మంది ఓటర్ల పేరును తొలగించడం జరిగింది.
తొలగించిన జాబితాలో పురుషులు 5056 మంది, మహిళలు 4890 మంది ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పరిశీలిస్తే పరిగిలో 3589మంది, వికారాబాద్‌లో 4033 మంది, తాండూరులో 492మంది, కొడంగల్‌లో 1832 మంది పేర్లు తొలగించబడ్డాయి. చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, డబుల్ పేర్లు ఉన్న వారి పేర్లు తొలగింపుతోనే ఓటర్ల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు.