వికారాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : లగచర్ల గిరిజనులకు మద్దతు పెరుగుతున్నది. ప్రతిపక్ష పార్టీలతోపాటు గిరిజన, ప్రజా సంఘాల నాయకులు అండగా నిలిచారు. ఈ నెల 11న ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు ఎదురుతిరిగిన వారి కోసం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు కరెంట్ సరఫరా నిలిపివేసి, ఇంటర్నెట్ సేవలను బంద్ చేసి ఇల్లిల్లూ జల్లెడ పట్టినా వారు దొరక్కపోవడంతో అమాయకులను భయభ్రాంతులకు గురి చేశారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు అని కూడా చూడకుండా దౌర్జన్యంగా వ్యవహరించగా ..బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించి..లగచర్ల బాధితులకు మేమున్నామన్న భరోసా కల్పిస్తున్నారు.
లగచర్ల బాధితులకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. పోలీసుల తీరును ఎండగడుతూ మేమున్నామనే భరోసాను ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఇస్తున్నారు. లగచర్ల ఫార్మాభూ బాధిత రైతులకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. ప్రభుత్వం రైతుల పట్టా భూములను తీసుకుంటామని ప్రకటించిన నాటి నుంచే వారికి అండగా ఉన్నది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతుల భూములను తీసుకోవద్దని పాదయాత్ర తలపెట్టారు. అదేవిధంగా ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదని ఎదురు తిరిగిన గిరిజన రైతులను ప్రభుత్వం జైల్లో పెట్టి నిర్బంధించగా.. ఆ రైతుల కుటుంబీ కులను ఢిల్లీలోని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్మన్ల దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లి..గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నియంతృత్వ వైఖరిని ఎండగట్టుతున్నది. స్పందించిన ఎస్టీ కమిషన్ సభ్యులు నేరుగా లగచర్లకు వచ్చి రేవంత్ ప్రభుత్వ చర్యలను ఎండగట్టడంతోపాటు గిరిజనులకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ, వామపక్ష పార్టీ లు, ప్రజాసంఘాల నాయకులు లగచర్ల గిరిజనులకు అండగా నిలిచి.. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
పది రోజులు దాటినా..
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధి, దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట, రోటిబండతం డా, పులిచర్ల తండాల పరిధిలోని సుమారు 1300 ఎకరాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నాటి నుంచే ఆయా గ్రామాలు, తండాల గిరిజనులు వ్యతిరేకి స్తున్నారు. ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత భూసేకరణకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పదుల సార్లు గిరిజనులతో సమావేశమై కంపెనీలొస్తే ఉద్యోగాలొస్తాయని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. ఫార్మా విలేజ్ ఏర్పాటుకు తమ భూములను ఇస్తామని ఒకరిద్దరు కాం గ్రెస్ నాయకులు ముందుకొచ్చి ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటనలు చేసినా బాధిత గ్రామాల ప్రజలంతా మొదట్నుంచి వద్ద్దంటే వద్దే.. వద్దు అంటూ వ్యతిరేకిస్తున్నారు.
అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ఈ నెల 11న లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లగా వారిపై గిరిజనులు ఎదురుతిరిగారు. ఈ ఘటన అనంతరం అమాయక గిరిజన మహిళలపై పోలీసుల దౌర్జన్యంతోపాటు సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి బాధిత తండాల్లో పర్యటించి ఎట్టిపరిస్థితుల్లోనూ భూములివ్వాల్సిందేనని బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు లగచర్ల ఘటన జరిగి పది రోజులు దాటినా ఇంకా పోలీసుల పహారాలోనే తండాలు ఉన్నాయి. లగచర్లతోపాటు తండాల చుట్టూ పోలీసులు పదుల సంఖ్యలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎవరి ని కూడా అటు వైపు వెళ్లనివ్వడం లేదు. తండాల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని ఎస్టీ కమిషన్ హెచ్చరించినా ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నది.